సీఎం జగన్‌పై సర్పంచి ‘పంచ్‌లు’.. జనసేన నేత శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు

‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి.

Updated : 30 Nov 2023 07:46 IST

రాజోలు, న్యూస్‌టుడే: ‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. కానీ.. రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోయింది. అందుకే మళ్లీ జగన్‌నే గెలిపించుకుందాం’ అంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనిపాడు జనసేన సర్పంచి అడబాల శ్రీనివాసరావు చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో భాగంగా కాట్రేనిపాడులో మంగళవారం జరిగిన సభలో సర్పంచి వేసిన ‘పంచ్‌లు’ వేదికపై ఉన్న వైకాపా నాయకులు అవాక్కయ్యారు. ‘పొన్నమండ నుంచి మనింటికొచ్చే రోడ్డు ఎంతో బాగుంది. లంక నుంచి కాట్రేనిపాడు వస్తున్న రోడ్డు కూడా చాలా బాగుంది’ అని వ్యంగ్యంగా చెబుతూ.. అందుకే మనం జగన్‌ను మళ్లీ గెలిపించుకుందామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వల్ల కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయ్‌’ అని వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ‘జగన్‌ని నేను పొగుడుతున్నాను. అభివృద్ధిని చెప్పొద్దా’ అంటూ ఆయన మరిన్ని విసుర్లు వేశారు. ఈ వ్యవహారమంతా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ‘కాట్రేనిపాడు సర్పంచి వైకాపా నాయకుల ముందే జగన్‌ ఎందుకు వద్దో చెప్పారు. రాజోలు నియోజకవర్గంలో మొదటిసారిగా ఒక మగాడిని చూశాను’ అంటూ యనుముల వెంకటపతిరాజు అనే ఎన్‌ఆర్‌ఐ ఆ సర్పంచికి మద్దతుగా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని