కాంగ్రెస్‌ను నడపగలిగే సరైన నేత ఖర్గే

రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు.

Updated : 30 Nov 2023 06:07 IST

 సోనియా గాంధీ వ్యాఖ్య
 ఖర్గే 50ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ

దిల్లీ: రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమికి ఆయన నాయకత్వం వహించి.. బలోపేతం చేసి విజయం దిశగా నడిపించాలని భాగస్వామ్య పార్టీల నేతలు కొందరు అభిప్రాయపడ్డారు. ఖర్గే 50ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ‘మల్లికార్జున ఖర్గే - పొలిటికల్‌ ఎంగేజ్‌మెంట్‌ విత్‌ కంపాషన్‌, జస్టిస్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పుస్తకాన్ని బుధవారం దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. ‘బలమైన సంస్థాగత నాయకుడిగా.. మా అందరి విశ్వాసం చూరగొన్న నేతగా.. కీలక పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఖర్గే సరైన నేతగా నిలుస్తున్నారు. ఆయనకు నాతోపాటు కాంగ్రెస్‌ పార్టీ అంతా అండగా నిలుస్తోంది’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని, 2024లోనే కాదు.. భవిష్యత్తులోనూ కలిసి పనిచేద్దామని, ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీఎంకే నేత టీఆర్‌ బాలు పేర్కొన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖర్గే భుజస్కంధాలపై ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ తదితరులు మాట్లాడారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు అన్ని పార్టీలూ కలిసి నడుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్యాంగంతోపాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న సంగతిని మరువబోనని స్పష్టం చేశారు. తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు హాజరయ్యారు. రాహుల్‌ గాంధీ హాజరు కాలేదు. ఖర్గే సేవలను కొనియాడుతూ ఆయన ఒక లేఖను పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని