Nara Lokesh: దళితుల్ని ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం

‘‘జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు.

Updated : 04 Dec 2023 06:58 IST

జగన్‌ పాలనలో ఆరు వేల మందిపై దాడులు
‘దళిత గళం’ ముఖాముఖిలో లోకేశ్‌

ఈనాడు, కాకినాడ: ‘‘జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు. ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శీలంవారిపాకల వద్ద ఆదివారం సాయంత్రం ‘దళిత గళం’ ముఖాముఖిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో మాట్లాడారు. మహాసేన రాజేష్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. లోకేశ్‌ పలువురి ప్రశ్నలు, సమస్యలు విని సమాధానం ఇచ్చారు.

సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి అప్పగిస్తాం

‘‘మాస్కు అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి చంపేశారు.. చీరాలలో కొవిడ్‌ సమయంలో మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ను కొట్టి చంపేశారు.. గుంటూరు జిల్లాలో రమ్యను, సీఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే నేటికీ చర్యలు లేవు.. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి డోర్‌డెలివరీ చేసిన అనంతబాబును సీఎం వెంటేసుకుని తిరుగుతున్నారు’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

దాడిచేసింది వారు... మాపై నింద

నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలిశానా అని లోకేశ్‌ అడిగిన ప్రశ్నకు ఇదే మొదటిసారని కోడికత్తి శ్రీను కుటుంబీకులు తెలిపారు. ‘‘ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా చూశాం.. బాబాయ్‌ గుండెపోటు డ్రామా చూశాం.. దాడిచేసింది వారు.. నింద మాపై వేశారు.. ముఖ్యమంత్రి వాయిదాలకు వెళ్లరు.. విచారణకూ సహకరించరు. దళిత యువకుడిని అయిదేళ్లుగా జైలులో పెట్టారు’’ అని లోకేశ్‌ అన్నారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగాయన్నారు.

లోకేశ్‌ యువగళం పాదయాత్ర 216వ రోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం ఉప్పాడ కొత్తపల్లి మండలం యండపల్లి కూడలిలోని శిబిరం నుంచి ప్రారంభమై శీలంవారిపాకల కూడలిలోని శిబిరం వద్దకు చేరుకుంది.


మా బిడ్డను చంపిన అనంతబాబు ధైర్యంగా తిరుగుతున్నారు

‘మా బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు ధైర్యంగా తిరుగుతున్నారు. మేము ఎవరికీ లొంగం.. దేనికీ భయపడం.. మీరంతా మాకు అండగా నిలబడాలి. బిడ్డను కోల్పోయి కుమిలిపోతుంటే చంద్రబాబు అండగా నిలబడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సీబీఐ విచారణ జరిపించి, దోషులను శిక్షిస్తారనే నమ్మకంతో బతుకుతున్నాం.’

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన


చేయని నేరానికి అయిదేళ్లుగా జైల్లో పెట్టారు

‘జగన్‌పై దాడిచేశాడని మా తమ్ముడిని అయిదేళ్లుగా జైలులో పెట్టారు. వాడు ఏ తప్పూ చేయలేదు. మా ఊరొచ్చినప్పుడు జగన్‌ను కలవాలని ప్రయత్నిస్తే మా ఇంటిచుట్టూ పోలీసులను కాపలా పెట్టించారు. మా న్యాయవాది సలీంనూ ఇబ్బంది పెట్టాలని చూశారు. దళిత నేత వెంకటరావు మాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆయన ఇంటినీ చుట్టుముట్టారు.’

జనిపల్లి శ్రీను (కోడికత్తి నిందితుడు) సోదరుడు సుబ్బరాజు వేదన


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని