తుపాను బాధితులకు భోజనమూ పెట్టలేరా?

తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 06 Dec 2023 06:33 IST

ప్రభుత్వ ముందస్తు సన్నద్ధత ఏదీ?
అభాగ్యులకు సాయమూ కరవు
హుద్‌హుద్‌, తిత్లీ సమయంలో పెంచిన పరిహారాన్ని తగ్గించి ఇస్తున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తుపానుపై ప్రభుత్వానికి ముందస్తు సన్నద్ధతా లేదు, బాధితులకు సాయమూ లేదని వ్యాఖ్యానించారు. మిగ్‌జాం తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో ఆయన మంగళవారం మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరాతీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని, ప్రభుత్వం సకాలంలో స్పందించట్లేదని ప్రజలు వాపోయారు. అనంతరం చంద్రబాబు దాదాపు 12వేల మంది పార్టీ కార్యకర్తలతో దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడారు. తెదేపా హయాంలో ప్రత్యేక జీవోల ద్వారా పరిహారం పెంచి సాయం చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు సంభవించిన తుపాన్ల సమయంలో.. అరకొరగానే సాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా ప్రజలను సన్నద్ధం చేయటంలో సీఎం విఫలమయ్యారని, వ్యవస్థల నిర్వీర్యం వల్లే నేడు ఈ దుస్థితి ఎదురైందని పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.

నాడు ప్రత్యేక జీవోలతో సాయం

‘విపత్తుల సమయంలో రైతులను ఆదుకోడానికి తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించాం. హుద్‌ హుద్‌ సమయంలో జీవో9, తిత్లీ తుపాను సమయంలో జీవో14 ద్వారా నష్టపరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలి’ అని చంద్రబాబు సూచించారు. తెదేపా హయాంలో ఇచ్చింది, వైకాపా ప్రభుత్వం ఇటీవల కొన్ని తుపాన్ల సమయంలో కోతలు పెట్టి ఎలా ఇచ్చిందో పార్టీశ్రేణులకు వివరించారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని