అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి విమర్శ

జగన్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి ఆరోపించారు.

Updated : 08 Dec 2023 06:19 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి ఆరోపించారు. తుపాన్‌ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, బాధితులకు కనీసం అన్నం పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వ అసమర్థత పోలవరానికి శాపమైందని, ప్రభుత్వ తుగ్లక్‌ చర్య వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వని కారణంగా విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు కాలేద తెలిపారు.

ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో చెప్పారంటే, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదన్నారు. రాష్ట్రం తన వాటాగా నిధులివ్వని కారణంగా కడప-బెంగళూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గం పనులు మధ్యలో నిలిచిపోయాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కేంద్రం ఇచ్చిన రూ. 6,106 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ పంపని కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిధులు రాలేదన్నారు. తిరుమలలో భక్తులిచ్చిన విరాళాలతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టలేని కక్కుర్తి ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను సాగనంపి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తేనే పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని