‘దిల్లీలో సీఎం జగన్‌కు పరాభవం’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో దిల్లీలో ఘోరపరాభవం ఎదురైందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Updated : 11 Feb 2024 06:40 IST

అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరక్క వెనక్కి
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో దిల్లీలో ఘోరపరాభవం ఎదురైందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం గంట ఐదు నిమిషాల పాటు యాంటీ రూమ్‌లో వేచి చూశాక జగన్‌.. ప్రధాని మోదీని కలిశారని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. ‘పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ధర్మదర్శనం మాదిరిగా ముఖ్యమంత్రులు అడిగిన వెంటనే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం పరిపాటి. అందులో భాగంగానే బిహార్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రధానిని కలిశారు. జగన్‌ కూడా ప్రధానితో 15-16 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమయాన్ని చెప్పకుండా సాక్షి పత్రిక ఖాళీగా వదిలేసింద’ని రఘురామ ఎద్దేవా చేశారు.

‘హోంమంత్రి అమిత్‌ షాతో భేటీకి జగన్‌కు అపాయింట్‌మెంట్‌ లభించదని నేను మూడు రోజుల క్రితమే చెప్పాను. అదే జరిగింది. అమిత్‌ షాను కలవకుండా శుక్రవారం రాత్రి కూడా దిల్లీలోనే ఉంటే పరువు పోతుందని భావించి, విజయవాడకు వెళ్లిపోయారు. కేవలం అమిత్‌ షాను కలిసేందుకే జగన్‌ దిల్లీకి వచ్చినప్పటికీ.. ఎంత ప్రయత్నించినా అది సాధ్యంకాలేదు. బహుశా సీఎంగా జగన్‌కు దిల్లీకి ఇదే ఆఖరి పర్యటన కావొచ్చు’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రకారం త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలూ వైకాపాకే దక్కుతాయని, అన్యాయంగా ఎవరూ పోటీ చేయకుండా చూడాలని కోరినట్లు తెలిసింది’ అని రఘురామకృష్ణరాజు చెప్పారు.

సినిమానే కాదు, జగన్‌నూ తిరస్కరిస్తున్నారు: సీఎం జగన్‌ బయోపిక్‌గా రూపొందించిన యాత్ర-2 చిత్రంలో ఆయన సోదరి షర్మిల, బాబాయ్‌ వివేకానందరెడ్డి పాత్రలు లేవని రఘురామ వెల్లడించారు. ‘యాత్ర చిత్రం.. ఒక మంచి మనిషిపై మంచిగా తీసిన సినిమా అయితే.. యాత్ర-2లో ప్రతినాయకుడిని హీరోగా చూపట్టే ప్రయత్నం చేశారు. జగన్‌ను మహాపురుషుడిగా అభివర్ణించడం నచ్చకే థియేటర్లకు జనం కరవయ్యారు. జగన్‌ బయోపిక్‌కు ఆదరణ లేదంటే.. జగన్‌నూ జనం తిరస్కరిస్తున్నారని అర్థం’ అని రఘురామ విశ్లేషించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న శంఖారావం కార్యక్రమం ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని