Uttam Kumar Reddy: కాళేశ్వరం.. స్వతంత్ర భారతంలో భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్‌

స్వతంత్ర భారతదేశంలోనే భారీ కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు.

Updated : 14 Feb 2024 08:21 IST

ఈనాడు డిజిటల్‌-జయశంకర్‌ భూపాలపల్లి, మహదేవపూర్‌-న్యూస్‌టుడే: స్వతంత్ర భారతదేశంలోనే భారీ కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టిన ఈ ప్రాజెక్టులో రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి.. 98 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చారన్నారు. దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదని, పూర్తి చేయాలంటే ఇంకా రూ.40 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగిపోతే.. నేటికీ భారాస నేతలెవరూ రాలేదన్నారు. ఆనాడు చీఫ్‌ డిజైనర్‌గా, చీఫ్‌ ఇంజినీర్‌గా మారిన కేసీఆర్‌.. దీనిపై నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేదని తేల్చారని తెలిపారు. వర్షాకాలం ముందు, తర్వాత ఎప్పుడూ నిర్వహణ చేపట్టలేదని ఆరోపించారు. రూ.100 పనికి రూ.500 ఖర్చు చేశారన్నారు. దీనిపై క్రిమినల్‌ విచారణ చేపడతామని పేర్కొన్నారు.

కేసీఆర్‌ సూచనతోనే మేడిగడ్డకు భాజపా ఎమ్మెల్యేలు రాలేదు: పొన్నం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనతో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సలహాతోనే భాజపా ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. భాజపా కేవలం ఆరోపణలకే పరిమితమైందన్నారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాదని.. ఆ రెండు పార్టీల నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు.

ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా: శ్రీధర్‌బాబు

ప్రాజెక్టు వస్తే ప్రజలకు మేలు కలుగుతుందని భావించి.. మూడు బ్యారేజీలకు ఎంతోమంది రైతులు తమ భూములను, ఇళ్లను త్యాగం చేశారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల వారికి చుక్కనీరు రాకున్నా భూములిచ్చారని తెలిపారు. జయశంకర్‌ జిల్లాలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పదేళ్లు పక్కన పెట్టారని, దాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

ప్రాజెక్టును ఈ స్ధితిలో చూడటం బాధాకరమని  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవి మేడిగడ్డ పగుళ్లు కావని.. తెలంగాణ ప్రజల గుండె పగుళ్లని పేర్కొన్నారు.  అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులూ పనికిరావని అంటున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డను నాణ్యతలోపంతో నిర్మించినవారిని, డిజైన్‌ చేసినవారిని జైళ్లలో పెట్టాలని డిమాండ్‌ చేశారు.


కేసీఆర్‌ చెప్పినవన్నీ అసత్యాలే..
రాష్ట్ర మంత్రుల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: నల్గొండ సభలో కేసీఆర్‌ అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రులు ధ్వజమెత్తారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు.

నల్గొండ జిల్లాకు నష్టం చేశారు
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ జిల్లాకు నష్టం చేసిందే కేసీఆర్‌. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టి 299 టీఎంసీల కృష్ణా జలాల వాటాకు అంగీకరించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో 70 శాతం నిర్మితమైన ప్రాజెక్టులను కూడా గత పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తిచేయకుండా మళ్లీ లోక్‌సభ ఎన్నికలు రాగానే నాటకాలు మొదలుపెట్టారు.  అబద్ధాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.


పదేళ్లలో తెలంగాణకు అన్యాయం
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్‌ నిజాలు మాట్లాడుతారని భావించాం. తన సహజ పద్ధతిలో అబద్ధాలే చెప్పారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు రాని కేసీఆర్‌ను పులి అంటారా? పిల్లి అంటారా? గతంలో ఎన్నడూలేనంతగా అన్యాయం, అవినీతి, దోపిడీ గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది. ఇప్పుడేమో ఏమీ ఎరుగనట్లు కేసీఆర్‌ నటిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరోపణలు చేస్తున్నారు.


ప్రజల దృష్టిని మరల్చేందుకే
- జూపల్లి కృష్ణారావు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే కేసీఆర్‌ ప్రజల దృష్టిని మరల్చేందుకే నల్గొండ సభ పేరుతో నాటకాలు ఆడారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? గత తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను గాలికి వదిలేసి హడావుడిగా నిర్మించి రూ.వేల కోట్ల ప్రజల సొమ్మను నీటిపాలు చేశారు.


అసహనంతోనే కేసీఆర్‌ వ్యాఖ్యలు
- తుమ్మల నాగేశ్వరరావు

నల్గొండ సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం. కృష్ణా జలాల అప్పగింతకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విధ్వంసానికి మూలకారణమైన ఆయన రెండు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం దారుణం. ఆయన తొందరపాటు వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఇకనైనా ఆయన అసహనాన్ని మాని ఓపిక పట్టాలి. వాస్తవాలు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని