భారాస ప్రభుత్వంపై పోరాడింది భాజపానే

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడింది భాజపా కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. విజయ సంకల్ప బస్సు యాత్ర బుధవారం నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మీదుగా రాత్రి ఆదిలాబాద్‌ చేరుకుంది.

Published : 22 Feb 2024 04:55 IST

హామీలు ఇచ్చి తప్పించుకుంటున్న కాంగ్రెస్‌
భాజపా సంకల్ప యాత్రలో బండి సంజయ్‌

ఆదిలాబాద్‌ పట్టణం, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే :  కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడింది భాజపా కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. విజయ సంకల్ప బస్సు యాత్ర బుధవారం నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మీదుగా రాత్రి ఆదిలాబాద్‌ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏనాడైనా కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారా? 60 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ జరిగితే ప్రశ్నించారా? రైతులకోసం కొట్లాడారా? మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి వ్యతిరేకంగా వారు ఆందోళనలు చేశారా? అంటూ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పారని... అందులో ఇప్పటికి 80 రోజులు పూర్తయ్యాయన్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్‌ రానుందని ఆ సాకుతో కాంగ్రెస్‌ నేతలు తప్పించుకుంటారన్నారు. కోలుకోలేని స్థితిలో ఉన్న భారాసతో తమకు ఎలాంటి పొత్తు ఉండదని పేర్కొన్నారు. ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, జడ్పీఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్‌, బస్సుయాత్ర ఇన్‌ఛార్జి పల్లె గంగారెడ్డి, మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో ఆంగ్లేయులు, నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడు రాంజీగోండ్‌తో సహా వెయ్యి మందిని ఉరితీసిన వెయ్యి ఉరుల మర్రి ప్రాంతాన్ని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌లతో కలిసి సంజయ్‌ సందర్శించారు. అక్కడున్న రాంజీగోండ్‌ స్తూపం వద్ద నివాళులర్పించి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని