సివిల్‌ సర్వెంట్లు ‘ఇండియన్స్‌’గా వ్యవహరించాలి

రాజకీయ పార్టీలకు, నాయకులకు కాకుండా.. ప్రజలకు, దేశానికి జవాబుదారీగా వ్యవహరించాలని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులనుద్దేశించి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హితవు పలికారు.

Updated : 23 Feb 2024 06:24 IST

నేతలకు, పార్టీలకు అనుకూలంగా మారొద్దు
ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పురందేశ్వరి ఉద్బోధ
భాజపా ప్రజాపోరు-2 ప్రారంభించినట్లు వెల్లడి

ఈనాడు, అమరావతి: రాజకీయ పార్టీలకు, నాయకులకు కాకుండా.. ప్రజలకు, దేశానికి జవాబుదారీగా వ్యవహరించాలని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులనుద్దేశించి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హితవు పలికారు. సివిల్‌ సర్వెంట్ల హోదాలో ఉన్న ‘ఇండియన్‌’ పదానికి సార్థకత చేకూరేలా పని చేయాలన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికారులు, నేతలు కుమ్మక్కై బోగస్‌ ఓటింగ్‌కు పాల్పడటంపై తాము ఫిర్యాదు చేయడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి, ఐఏఎస్‌ గిరీషా సహా పోలీసు, ఇతర అధికారులపై చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని పునఃపరిశీలించాలని కూడా ఈసీకి లేఖ రాసినట్లు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

‘తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు అధికారుల యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తీసుకొని 35 వేల దొంగ ఓట్లను చేర్చారు. ఫాం-8 ఆధారంగా నకిలీ ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేశారు. నేర స్వభావం ఉన్నవారే ఇలాంటివి చేయగలరు’ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు వైకాపా అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చడంతో పాటు సానుభూతిపరుల ఓట్లను కూడా బదలాయిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. ‘గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో వైకాపా నేతలు ఓటర్ల జాబితా తయారీ నుంచే అక్రమాలకు తెరలేపినట్లు మాకు సమాచారముంది. ఎన్నికల సిబ్బంది నిజాయతీగా వ్యవహరించి, ఈ అక్రమాలను అడ్డుకోవాలి. ఈసీ విజిలెన్స్‌ విభాగం అన్నీ గమనిస్తోంది. దీనిపై మేం ఈసీకి ఫిర్యాదు చేస్తాం. ప్రజలు పోలింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాల’ని కోరారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ చెప్పినప్పటికీ, వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా వాడుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడాన్ని ఆమె ఖండించారు.

ఎన్నికల హామీల అమలులో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను బుధవారం నుంచి చేపట్టిన ప్రజాపోరు-2 ద్వారా ప్రజలకు వివరిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు. ఈ పోరుయాత్ర ఈ నెల 29 వరకు కొనసాగుతుందన్నారు. పొత్తులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, పొత్తులతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

27న ఏలూరులో ‘ప్రజాపోరు’ సభ

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: భాజపా ఆధ్వర్యంలో ఈ నెల 27న ఏలూరులో ‘ప్రజాపోరు’ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. సభ నిర్వహించే స్థానిక ఇండోర్‌ మైదానాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గురువారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏమి చేసిందో సభ ద్వారా ప్రజలకు వివరించనున్నాం. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. నేను ఎక్కడ పోటీ చేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. వైకాపా చేసిన మోసాలనూ ఈ సభలో వివరిస్తాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు