లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం

పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వస్తున్నారు.

Published : 24 Feb 2024 03:57 IST

షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు నేడు హైదరాబాద్‌కు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ 
రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో వారు టికెట్లపై చర్చించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనేందుకు వారు వస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా మిగిలిన 16 స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉంది. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ప్రభుత్వం ఇటీవలే నియమించగా.. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కావాలని తాను ఈ పదవికి రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపానని శుక్రవారం ఆయన ప్రకటించారు. ఈ సీటు కోసం అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు మరికొందరు నేతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ బీసీ నేతలు మూణ్నాలుగు స్థానాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా జహీరాబాద్‌, మెదక్‌, సికింద్రాబాద్‌ టికెట్లపై దృష్టి సారించారు. సికింద్రాబాద్‌ సీటును బీసీలకు ఇవ్వడం వల్ల నగరంలో కాంగ్రెస్‌కు ఆదరణ లభిస్తుందనేది పార్టీ వర్గాల అంచనా. ప్రత్యర్థి భారాస కూడా సికింద్రాబాద్‌ టికెట్‌ను బీసీలకిచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

5 రిజర్వుడ్‌ స్థానాలకు 50 మంది ఆశావహులు

ఎస్సీ, ఎస్టీ కోటాలో రిజర్వు అయిన అయిదు స్థానాలకు దాదాపు 50 మంది టికెట్లు అడుగుతున్నారు. వారిలో   ప్రస్తుతం రాజకీయాల్లో   ఉన్న నేతలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్‌ అధికారులు, డాక్టర్లు, లాయర్ల వంటివారు సైతం ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల వార్‌ రూం కమిటీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ ఆఫీస్‌ బేరర్లతో వార్‌రూం కమిటీ వేసింది. పవన్‌ మల్లాదిని ఛైర్మన్‌గా నియమించింది. కో ఛైర్మన్లుగా సందేశ్‌ శింగాల్కర్‌, సతీశ్‌ మన్నె, సంతోశ్‌ రుద్ర, జక్కని అనీతలను నియమించింది. శిక్షణ అండ్‌ యూత్‌కు వాసీం భాషా, ఆరోన్‌ మిర్జాలను, అనలిస్ట్‌గా శ్రీకాంత్‌ కుమ్మరి, సోషల్‌ మీడియా బాధ్యతలు గిరిజా షెట్కర్‌, నవీన్‌ పట్టెంలను నియమించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ అనుమతితో ఈ నియామకాలు చేపట్టినట్టు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని