సంక్షిప్త వార్తలు (9)

దిల్లీ పరిసరాల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నిజాం కళాశాల నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పీసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు.

Updated : 25 Feb 2024 06:55 IST

రైతు ఉద్యమానికి సంఘీభావంగా 28న ర్యాలీ: అన్వేష్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దిల్లీ పరిసరాల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నిజాం కళాశాల నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పీసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, చివరికి వారిని హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదని ఆరోపించారు. ర్యాలీలో రైతులు, అన్ని పార్టీల నేతలు, యువత భాగస్వాములై రైతుల పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు.


1న తిరుపతిలో కాంగ్రెస్‌ శంఖారావ సభకు రేవంత్‌

తిరుపతి, న్యూస్‌టుడే: తిరుపతి వేదికగా మార్చి 1న కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ నిర్వహించన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరుకానున్నారు.


భువనగిరి లోక్‌సభ టికెట్‌ జాజులకు కేటాయించాలి

తెలంగాణ బీసీ సంఘాల ఐకాస తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి లోక్‌సభ టికెట్‌ను కేటాయించాలని బీసీ సంఘాల ఐకాస కోరింది.  శనివారం ఐకాస అధ్యక్షుడు కుందారం గణేశ్‌చారి అధ్యక్షతన 136 కుల సంఘాల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా జాజులను భువనగిరి బరిలో నిలపాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. బీసీల సమస్యలపై ఏళ్లుగా పోరాడుతున్న ఆయనకు కాంగ్రెస్‌ భువనగిరి టికెట్‌ ఇస్తే 60% ఉన్న బీసీ జనాభా గెలిపించుకుంటామని తెలిపారు. త్వరలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని, తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి తమ తీర్మాన ప్రతిని అందజేసి జాజులకు టికెట్‌ కోసం అభ్యర్థిస్తామని గణేశాచారి పేర్కొన్నారు.టికెట్‌ ఇవ్వని పక్షంలో బీసీ సంఘాల ప్రతినిధిగా పోటీలో ఉంటారని చెప్పారు.


దళితులకు తెదేపా 20 సీట్లు కేటాయించడం చరిత్రాత్మకం: వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అయిదేళ్లుగా దళితులను సీఎం జగన్‌ అణచివేశారని, కానీ తెదేపా అధినేత చంద్రబాబు శనివారం విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో ఆ వర్గానికి ప్రాధాన్యం కల్పించారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కొనియాడారు. 20 సీట్లు కేటాయించడం చరిత్రాత్మకమన్నారు. జగన్‌రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దళితులకు అగ్రపీఠం వేసిన తెదేపాకి ఎస్సీలంతా అండగా ఉండాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.


తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు సమన్వయ కమిటీ ఏర్పాటు

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో నిర్వహించే భారీ బహిరంగసభను విజయవంతం చేసేలా రెండు పార్టీల నుంచి పది మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎం.వి.సత్యనారాయణరాజు, జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేశ్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్పలను నియమించారు.


తమ వర్గం ఎన్నికల గుర్తును ఆవిష్కరించిన శరద్‌ పవార్‌

ముంబయి: ఎన్నికల కమిషన్‌ తమకు కేటాయించిన ‘బూరుగు ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)-శరద్‌చంద్ర పవార్‌’ అధినేత శరద్‌ పవార్‌ రాయ్‌గఢ్‌ కోటలో శనివారం ఆవిష్కరించారు. ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేసేందుకు కొత్త గుర్తు ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వ నిర్మాణం, సమస్యల పరిష్కారం కోసం తమకు మద్దతివ్వాలని ప్రజలను ఆయన కోరారు.


అభ్యర్థుల్లో అత్యధికులు విద్యాధికులే

ఈనాడు, అమరావతి: తెదేపా- జనసేన తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో సుమారు పది మంది మినహా మిగిలిన వారంతా ఉన్నత విద్యావంతులే. మొత్తం 99 మందిలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ వరకు చదివిన వారు సుమారు పది మంది ఉన్నారు. ఎక్కువ మంది డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యనభ్యసించారు. విశ్రాంత ఐఏఎస్‌ బి.రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తున్నారు. పాలకొల్లు అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గంగాధర నెల్లూరు అభ్యర్థి థామస్‌ పీహెచ్‌డీ చేశారు. కొండెపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే డీబీవీ స్వామి, నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి) వైద్యులు. తెదేపా అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లు ఉన్నారు.  


ఎన్నికల తర్వాత వైకాపా కార్యాలయాలు అద్దెకివ్వడం ఖాయం

మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ జైలుకెళ్లడం, వైకాపా కార్యాలయాలు అద్దెకివ్వడం ఖాయమని తెదేపా సీనియర్‌ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. తెదేపా-జనసేన పొత్తుతో వైకాపా వాళ్లకొచ్చిన సమస్యేంటని ప్రశ్నించారు. తెదేపా-జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటనతో వైకాపాలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు వైకాపాలోని కాపు నాయకులకు ఆత్మాభిమానం గుర్తుకురాలేదా అని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘మంత్రులు అంబటి రాంబాబు, రోజా, వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్‌రెడ్డి ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కేవలం నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మాత్రమే ప్రకటించారు’’ అని విమర్శించారు.


మోదీ సర్కారు నిర్ణయాలతో 20 ఏళ్లు వెనక్కు..

ఆర్థిక వృద్ధి అంటే ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగం నుంచి పారిశ్రామిక రంగానికి, అక్కడి నుంచి సేవారంగానికి విస్తరించడం. అన్ని దేశాలూ ఇదే వరుస క్రమాన్ని అనుసరిస్తాయి. భారత్‌ కూడా ఆ మార్గంలోనే నడిచింది. 2004-05 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయరంగ కూలీల సంఖ్య 6.7 కోట్ల మేర తగ్గింది. వారంతా అధిక వేతనాలు వచ్చే ద్వితీయ, తృతీయ రంగాలకు మళ్లారు. ఇది మన్మోహన్‌ నేతృత్వంలో సాధించిన చరిత్రాత్మక పురోగతి. కానీ మోదీ సర్కారు తప్పుడు నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కువెళ్లింది.

జైరాం రమేశ్‌


వారితో జాగ్రత్త

సంత్‌ రవిదాస్‌ బోధనలను అనుసరిస్తూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేయవచ్చు. ఆయన్ను అనుసరించేవారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. కానీ సర్కారు అలా చేయడం లేదు. సంత్‌ రవిదాస్‌ను, ఆయన బోధనలను విస్మరించినవారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయన ముందు తలలు వంచుతున్నారు. వారి విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

మాయావతి


భాజపా పరిస్థితి ఏంటో!

ఇండియా కూటమిలో సీట్ల పంపిణీని భాజపా తీవ్రంగా ఎగతాళి చేస్తోంది. కానీ బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తమ పార్టీకి పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు దక్కుతాయో కమలనాథులకు తెలియదు. అసలు ఆ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాలు తమతో చర్చిస్తాయో లేదో కూడా వారికి తెలియదు.

ప్రియాంకా చతుర్వేది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని