వాలంటీర్లతో దున్నేద్దాం

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా.. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు.

Updated : 28 Feb 2024 07:18 IST

ప్రతి బూత్‌లో 60% ఓట్లు మనకే పడాలి
గృహసారథులతో కలిసి ఇంటింటికీ తిరిగి వైకాపాకే ఓటేసేలా ఒప్పించాలి
సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా బూత్‌ కమిటీల శిక్షణ తీరు

ఈనాడు, అమరావతి: వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా.. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ బూత్‌ పరిధిలోనూ వారి సాయంతో వైకాపాకు 60% ఓట్లు పడేలా చూడాలని నాయకులకు లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మండలస్థాయి, సచివాలయ స్థాయి సమన్వయకర్తలకు ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణలో.. ఈ మేరకు సూచించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి బూత్‌లో 60% ఓట్లు సాధించాలని నాయకులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శిక్షణలో భాగంగా చెప్పిన వాటిలో కొన్ని వివరాలు...

బూత్‌లవారీగా ట్రాకింగ్‌

వైకాపా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ ప్రతినిధులు, ఐటీ నిపుణుడు లోకేశ్వరరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా బూత్‌ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై వివరించారు. బూత్‌లవారీగా గత ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి ఎలా ఉంది?.. ఎక్కడెక్కడ అప్పట్లో తెదేపాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే వివరాలను వెల్లడించారు. బూత్‌ స్థాయిలో ఓటరు జాబితాను ఎలా నిర్వహించుకోవాలి? అందులో తెదేపా/జనసేన ఓటర్లు, తటస్థ ఓటర్లు, వైకాపా సానుకూల ఓటర్లు అనేది స్పష్టంగా ఎలా వర్గీకరించుకోవాలి? వంటివాటిపై శిక్షకులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లు ఉంటే.. ఇప్పటివరకూ 43 వేలకు పైగా బూత్‌ కోర్‌ కమిటీలను సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కమిటీల్లో ముగ్గురు కోర్‌ సభ్యులు ఉంటారని, వారికి వాలంటీర్లు, గృహసారథులను అనుసంధానంగా పనిచేస్తారని వివరించారు. అంటే, ప్రతి కమిటీలో వాలంటీర్లు తప్పనిసరిగా ఉంటారన్నమాట.

‘రాష్ట్రవ్యాప్తంగా 80ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులు కలిపి 10లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా ఈసారి ఇంటినుంచే ఓటు వేసే వెసులుబాటు ఉండనుంది. ఆ అవకాశాన్ని పొందేందుకు వారందరూ సకాలంలో దరఖాస్తు చేసేలా చూసుకోవాలి.. బూత్‌ కమిటీలు వీరి ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. దగ్గరుండి దరఖాస్తు చేయించి, వారికి అవకాశం వచ్చేవరకు ఫాలోఅప్‌ చేయాలి’   అని చెప్పారు. 

  • తెదేపా/జనసేన ఓటర్లు.. తటస్థ ఓటర్లు అని వర్గీకరించి, వారు వైకాపా వైపు మొగ్గు చూపేలా ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
  • బూత్‌లకు సంబంధించి కోర్‌ కమిటీల సభ్యులు, వాలంటీర్లు, గృహ సారథులతో పాటు గడప గడపకు వెళ్లి ప్రతి ఇంట్లోని వారితో మాట్లాడి వారంతా వైకాపాకు ఓటేసేలా ఒప్పించాలి.
  • వైకాపా సానుకూల ఓటర్లంతా 100% పోలింగ్‌ రోజున వచ్చి ఓటేసేలా మొబిలైజేషన్‌ బాధ్యతను వాలంటీర్లు, గృహసారథులకు అప్పగించాలి.
  • పోలింగ్‌ రోజున బూత్‌ల కోర్‌ కమిటీ సభ్యులంతా చురుగ్గా ఉండి, ఆ బూత్‌లో 60% ఓట్లు వైకాపాకు పడేలా సమన్వయం చేయాలి.
  • పోలింగ్‌ రోజు వరకూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. అందులో జగన్‌ ప్రభుత్వం గురించి సానుకూల ప్రచారం చేయాలి.

ఇలాంటి పలు అంశాలతోపాటు.. క్షేత్రస్థాయిలో వైకాపాకు మద్దతుగా సానుకూల ప్రచారాన్ని జనంలో ఎలా చేపట్టాలనేది కూడా వివరించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్‌, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు కూడా బూత్‌స్థాయిలో ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని