ఎన్నికల కోసమే కేంద్రం కొత్త సర్వే

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. పదేళ్లపాటు గాఢనిద్రలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గృహ వినియోగ వ్యయ సర్వేను విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 28 Feb 2024 04:09 IST

కులగణనతో జనాభా లెక్కింపు పూర్తి చేయండి
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. పదేళ్లపాటు గాఢనిద్రలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గృహ వినియోగ వ్యయ సర్వేను విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేలో కేంద్రం చూపుతున్నట్లుగా ప్రతీది బాగుంటే, గ్రామాల్లో ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కచ్చితమైన సమాచారం కోసం త్వరలోనే జనాభా గణనను నిర్వహించాలని, అందులో కుల గణనను కూడా చేర్చాలని ఎక్స్‌ వేదికగా ఖర్గే డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనిని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.

రైతుల నెలవారీ ఆదాయం దేశ సగటుకంటే తక్కువగా ఉంది

‘ప్రభుత్వ పథకాల నుంచి ఐదు శాతం పేద కుటుంబాలు ఎందుకు తక్కువ ప్రయోజనం పొందాయి? కేవలం నెలకు 68 రూపాయలే పొందాయా? పెట్టుబడిదారీ మిత్రులు మిగిలిన ప్రయోజనాలను పొందారా? రైతుల నెలవారీ ఆదాయం గ్రామీణ భారతదేశ సగటు ఆదాయం కంటే ఎందుకు తక్కువగా ఉంది? మోదీ ప్రభుత్వం ఉజ్వల పథకం విజయవంతమైందని గొప్పలు చెప్పకుంటున్నారు. మరి గ్రామీణ కుటుంబాల ఇంధన వ్యయం 1.5 శాతంగా మాత్రమే ఎందుకు ఉంది?’ అని ఖర్గే ప్రశ్నించారు.

సర్వేల ఖ్యాతి తగ్గించొద్దు!

నీతి ఆయోగ్‌ అధికారులు భారతదేశంలో పేదరికం కేవలం ఐదు శాతమేనని చెబుతున్నారని, అయితే అదే నీతి ఆయోగ్‌కు చెందిన మరో నివేదిక ప్రకారం పేదరికం 11.28 శాతంగా ఉందని ఖర్గే చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలను ఎందుకు హేళన చేస్తోందని ప్రశ్నించారు. సర్వేల ఖ్యాతి తగ్గించవద్దని మోదీని ఖర్గే కోరారు.

ఈ సర్వే ఏ రౌండ్‌ది?

వాస్తవాలను దాచిపెట్టి జీడీపీ బేస్‌ ఇయర్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాన్ని పొందాలనుకుంటోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అసలు ఈ గృహ వినియోగ వ్యయ సర్వే 69వ రౌండ్‌ దా లేక 70వ రౌండ్‌ దా అనేది తెలియదని ఆయన వ్యాఖ్యలు చేశారు. నకిలీ డేటాను గుర్తించకుండా ఉండేందుకే ఈ సర్వే ఏ రౌండ్‌దో కేంద్ర చెప్పడం లేదని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని