‘రైతు ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో పులివెందుల’

జగన్‌ పాలనలో పులివెందుల నియోజకవర్గంలో వ్యవసాయం అథోగతి పాలైందని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 28 Feb 2024 04:29 IST

సొంత నియోజకవర్గానికి ఏం చేశారో రెఫరెండానికి సిద్ధమా?
సీఎంకు తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సవాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో పులివెందుల నియోజకవర్గంలో వ్యవసాయం అథోగతి పాలైందని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నాలుగు రోడ్ల నిర్మాణాలనూ పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. పులివెందులకు ఏం చేశారో రెఫరెండానికి సిద్ధమా? అని సీఎం జగన్‌కు మంగళవారం ఓ ప్రకటనలో సవాలు చేశారు. ‘కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయనట్టు.. తానేదో అన్నీ చేసేసినట్టు జగన్‌ అబద్ధాలు చెప్పారు. జగన్‌ సీఎం అయ్యాక పులివెందులలో అదనంగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు. గ్రామీణ సడక్‌ యోజన కింద 2020లో కేంద్ర నిధులతో ప్రారంభమైన రహదారి పనుల్లో పది శాతమూ పూర్తి చేయలేదు. సెంటు పట్టాలిచ్చి 8 వేల ఇళ్లను నిర్మించామనడమేకానీ ఎనిమిది మంది లబ్ధిదారులకైనా ఇచ్చారా? నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. యురేనియం ప్రాజెక్టుతో కలుషిత వ్యర్థాలు భూమిలో కలిసి రైతులు, ప్రజల ఇబ్బందులపై కేంద్రంతోగానీ, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కానీ మాట్లాడారా? పులివెందులలో సూక్ష్మసేద్యం కోసం చంద్రబాబు పరికరాలు అందిస్తే జగన్‌ ఆ ప్రాజెక్టునే అటకెక్కించారు’ అని భూమిరెడ్డి మండిపడ్డారు.

‘నాడు-నేడు’ కింద ఎన్ని పాఠశాలలు బాగు చేశారు?: ‘నాడు-నేడు’ కింద పులివెందుల నియోజకవర్గంలో ఎన్ని పాఠశాలలకు మరమ్మతులు చేశారో చెప్పాలని జగన్‌ను రాంగోపాల్‌రెడ్డి నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని