Chandrababu: విభేదాలు పక్కనపెట్టి.. కలసి పనిచేయండి: అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపు

తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్‌ దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు.

Updated : 28 Feb 2024 09:28 IST

ఉండవల్లికి వరుస కడుతున్న నాయకులు

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్‌ దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు అధినేతను కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించడంతో పాటు ఇతర కారణాలతో టికెట్‌ రాని నాయకులతో చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు. ఏ కారణంగా వారికి టికెట్‌ ఇవ్వలేకపోయారో వివరిస్తున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ‘టికెట్‌ ఇవ్వలేదంటే పార్టీ వారిని వద్దనుకున్నట్టు కాదు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగింద’ని వివరించారు. తెదేపా-జనసేన తొలి జాబితా ప్రకటించాక ఆయన సుమారు 15 నియోజకవర్గాలకు చెందిన నాయకులతో స్వయంగా మాట్లాడారు.

అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలుంటే సరిదిద్దారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పలువురు నాయకులు ప్రకటించారు. మంగళవారం చంద్రబాబును కలిసిన వారిలో త్వరలో తెదేపాలో చేరనున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి పి.నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, శంకర్‌యాదవ్‌, జయనాగేశ్వర్‌రెడ్డి, తిప్పేస్వామి తదితరులున్నారు. నెల్లూరు జిల్లాలో మార్చి 2న చంద్రబాబు పర్యటనపై చర్చించేందుకు నారాయణ ఆయనను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని సీట్లూ తెదేపానే గెలుస్తుంది. వైకాపాకు జిల్లాలో నాయకులే లేరు. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరతార’ని వివరించారు.

గెలిచాక సముచిత ప్రాధాన్యం

అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణిశ్రీకి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవ్‌రెడ్డి, నర్సానాయుడిని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి శ్రావణిశ్రీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. రాయచోటి టికెట్‌ను రాంప్రసాద్‌రెడ్డికి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న అక్కడి ముఖ్యనేత ప్రసాద్‌నూ పిలిపించారు. రాంప్రసాద్‌రెడ్డి, ప్రసాద్‌లను కూర్చోబెట్టి చర్చించారు. ఇద్దరూ చేతులు కలిపి సీటు గెలుచుకురావాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినందున ఆ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజును పిలిపించారు. అక్కడ జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని, తర్వాత పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కదిరి అసెంబ్లీ టికెట్‌ కోసం చంద్రబాబును కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు తెదేపా ఎప్పుడూ సముచిత స్థానం కల్పించిందని, జగన్‌ మైనార్టీలతో ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చాక తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కడప లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్న రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, తంబళ్లపల్లి టికెట్‌ జయచంద్రారెడ్డికి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌, అనంతపురం లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న జేసీ పవన్‌రెడ్డి తదితరులు చంద్రబాబును కలిశారు. జనసేనతో పొత్తు వల్ల తెనాలి సీటును కోల్పోయిన తనకు గుంటూరు పశ్చిమ నుంచి పోటీకి అవకాశమివ్వాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఇప్పటికే చంద్రబాబును కోరారు. ఆయన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని