YS Jagan: 24 గంటల్లోనే మాట మార్చిన జగన్‌

‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా. ఇక ఒకటో అరో ఉంటాయంతే’ అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. అయిదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు.

Updated : 29 Feb 2024 10:13 IST

ఒకటో అరో మాత్రమే మార్పులుంటాయని చెప్పి రోజు గడిచేలోపే 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
గుంటూరు లోక్‌సభ స్థానంలో ఉమ్మారెడ్డి రమణను తప్పించి ఎమ్మెల్యే రోశయ్యకు ఛాన్స్‌
పొన్నూరుకు మంత్రి అంబటి సోదరుడు మురళి
ఎంపీ మాగుంట రాజీనామా ప్రకటించగానే.. ఒంగోలులో చెవిరెడ్డి నియామకం
కందుకూరులో కొత్తగా ఎమ్మెల్యే మధుసూదన్‌కు అవకాశం
గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మి

ఈనాడు, అమరావతి: ‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా. ఇక ఒకటో అరో ఉంటాయంతే’ అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. అయిదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు. మొత్తంగా రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులతో 8వ జాబితాను బుధవారం విడుదల చేశారు.

అంబటి కుటుంబానికి రెండా.. ఒకటేనా?

పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి  నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైకాపాను వీడి మళ్లీవచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పైగా సత్తెనపల్లిలో కొందరు మంత్రి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది.

కందుకూరులో 12 రోజులకే మళ్లీ మార్పు

కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్‌ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైకాపాలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే.. బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు.

కుమారుడిని తప్పించి అల్లుడికి..

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల 2న నియమించారు. ఆయన దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను బుధవారం నియమించారు.

జీడీ నెల్లూరులో మూడోసారి మార్పు

గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు. జనవరి 18న నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడటంతో అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకుంది. నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈ నెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది.

ఒంగోలులో ముందుగానే నిర్ణయించినా..

ఒంగోలు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైకాపా పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ.. సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు