Pawan Kalyan: జగన్‌ కోట బద్దలు కొడతాం

మా అన్నయ్య చిరంజీవి నన్ను యాక్టింగ్‌ స్కూల్‌కు పంపి పనిచేసే దారి చూపారు. డబ్బు సంపాదించే మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గం ఉండబట్టే రాష్ట్రంలో కౌలు రైతులకు కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగా.

Updated : 29 Feb 2024 10:20 IST

నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్లు.. నా వాళ్లు కాదు
జగన్‌లా మన దగ్గర వేల కోట్లున్నాయా?
తెదేపాలా సంస్థాగత బలముందా?
పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయగలమా?
అన్నీ ఆలోచించే 24 స్థానాలు తీసుకున్నాం
‘జెండా’ సభలో పవన్‌కల్యాణ్‌


మా అన్నయ్య చిరంజీవి నన్ను యాక్టింగ్‌ స్కూల్‌కు పంపి పనిచేసే దారి చూపారు. డబ్బు సంపాదించే మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గం ఉండబట్టే రాష్ట్రంలో కౌలు రైతులకు కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగా. మన యువత చేతుల్లోనూ డబ్బు ఉండాలంటే.. వారికి సంపాదించుకునే మార్గం చూపాలి. జగన్‌ ఎప్పుడైనా యువత ఆశలు, ఆశయాలు తెలుసుకున్నారా? వారిలో ప్రతిభ బయటకు తీసే ఆలోచన చేశారా? నైపుణ్యాలు కల్పించారా? మరెందుకు ఈ ముఖ్యమంత్రి?’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌


జగన్‌ ఎలాంటి వారో తెలుసా?

సొంత బాబాయినే మర్డర్‌ చేయించినవారు.. సొంత చెల్లినే గోడకేసి కొట్టినవారు.. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు.. జగన్‌లాంటి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతారు.. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లు దీన్ని మర్చిపోవద్దు.’

పవన్‌ కల్యాణ్‌


తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి: ‘మద్దతుదారుల పేరుతో నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్లు నా వాళ్లు కాదు.., నాకు అలాంటి వారి సలహాలు, సూచనలు అవసరం లేదు’ అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ‘జనసైనికులు సిద్ధంగా ఉన్నా.. ప్రజలు మనవైపు ఉన్నా.. ప్రతి ఒక్కరినీ ఓటుకు తెచ్చే నాయకత్వం జనసేనకు సిద్ధంగా ఉందా? ఆలోచించండి. అన్నీ అర్థం చేసుకునే 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో పొత్తు పెట్టుకున్నాం’ అని కార్యకర్తలకు చెప్పారు. ‘అధికారం తమ ఫ్యాక్షన్‌ కోటల్లోనే ఉండాలనే ఆధిపత్యపు ధోరణి వైకాపా వారిది. సామాన్యుడు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. వ్యూహాలు, పొత్తులు పెట్టుకుంటే భరించలేరు. అందుకే తెదేపాతో పొత్తుపై రకరకాలుగా కథలు చెబుతున్నారు’ అని మండిపడ్డారు. ‘మెతుకు మెతుకు వెతుక్కున్నాం.. ఇటుక ఇటుక పేర్చుకున్నాం. ఇప్పుడిప్పుడే జనసేన ఇల్లు కడుతున్నాం. కోట కడతాం.. జగన్‌ కోట బద్దలు కొడతాం’ అని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన ‘జెండా’ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ‘2024 ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నా.. వైకాపా కోటల్ని బద్దలు కొడదాం.. జనసేన, తెదేపా పొత్తు గెలవాలి. విజయం సాధించాలి. జగన్‌ పోవాలి. వైకాపా నేలమట్టం కావాలి. మోదీ మరోసారి ప్రధాని కావాలి’ అని పవన్‌ ఆకాంక్షించారు.

మర్డర్‌ చేసినా.. వెనకేసుకొచ్చే సమూహం జగన్‌ది

‘బాబాయిని మర్డర్‌ చేసినా గుండెపోటు అని.. జగన్‌ ఓడిపోతున్నా గెలుస్తున్నారని.. హామీల్ని నిలబెట్టుకోకున్నా.. అద్భుతం ఆహాఓహో అనే సమూహం ఆయన వెనకుంది. దళితుణ్ని చంపి డోర్‌డెలివరీ చేసినా వెనకేసుకొచ్చే సమూహం అది. జగన్‌ మర్డర్లు చేసినా, ఆయన అనుయాయులు అత్యాచారాలు చేసినా, దోపిడీలు, దారుణాలు చేసినా ఆయన సమూహమంతా వెనకేసుకొస్తున్నారు’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు?

‘నేనేమైనా డబ్బు తిన్నానా? వేల కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? పదేళ్లుగా అవమానాలు, తిట్లు తప్ప ఏం సంపాదించాను. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పార్టీకే ఖర్చు పెట్టాను. నిజంగా నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించొద్దు. విదేశాల్లో కూర్చుని, టీవీల్లో కూర్చుని ప్రశ్నించడం కాదు.. నా జనసైనికుల్లా, నా వీర మహిళల్లా నా వెంట నడవండి. నాతో నడిచేవాళ్లే నావాళ్లు’ అని స్పష్టం చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌తో స్నేహం అంటే చచ్చేదాకా.. నాతో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా?’ అని చెప్పారు. ‘ఇద్దరు కలిస్తే చూడలేరు. నలుగురు నవ్వుకుంటే చూడలేరు. పదిమంది పచ్చగా ఉంటే సహించలేరు. తల్లిని, చెల్లిని దూరంగా పెట్టేవాళ్లను, ప్రజల్ని కష్టాలు పెట్టేవాళ్లను సైకో జగన్‌ అంటారు’ అని ధ్వజమెత్తారు. ‘జగన్‌కు అధికారం ఇస్తే స్కాం ఆంధ్ర అవుతుందని 2014 ఎన్నికల్లో మోదీ చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైంది’ అని ధ్వజమెత్తారు.

జగన్‌లా దోచేసిన డబ్బుందా?

‘వైకాపా జగన్‌లా వేలకోట్ల రూపాయల్ని వారసత్వంగా తినేశామా? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి సొమ్మేదీ?’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘తెలుగుదేశం పార్టీలా.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉందా? అలాంటి వ్యవస్థలున్నాయా? పోల్‌ మేనేజ్‌మెంట్‌ తెలుసా? ఆర్గనైజేషన్‌ బలం ఉందా? సంస్థాగతంగా పాతుకుపోయిన తెదేపాతో పోటీ పడగలమా? ప్రతి నియోజకవర్గంలో 800 నుంచి 1,000 మంది బూత్‌ కార్యకర్తలున్నారా? 50 రోజుల పాటు వారికి ఎంతోకొంత డబ్బులిస్తూ భోజనం పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా?’ అని ప్రశ్నించారు. మన నాయకత్వం ఎదుగుతోంది. ఎదురుచూడాలి. ఈలోగా రాష్ట్రాన్ని జగన్‌ దాష్టీకానికి బలికానివ్వం. వ్యూహం నాకొదిలేయండి. నన్ను నమ్మండి’ అని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను వారికి తాకట్టు పెట్టారు

‘అయిదుకోట్ల ప్రజలున్న రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌రెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి తాకట్టు పెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు ఎక్కడికి వెళ్లినా పంచాయితీలు చేసేది అయిదుగురే.. ఎవరికి ఎంతివ్వాలో వీరే చెబుతారు. ఇదే జగన్‌ చెప్పే క్లాస్‌ వార్‌.. మాట్లాడితే జగన్‌ తానొక్కడినే అంటారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను తీసుకెళ్లిన వ్యక్తి ఒక్కడెలా అవుతారు?’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి జనసైనికులూ.. వైకాపా గూండాయిజాన్ని చూసి భయపడొద్దు. ఉద్ధండుడైన రాజకీయ నేత చంద్రబాబు ఉన్నారు. సామాన్య ప్రజలపై వైకాపా గూండాలు దాడి చేస్తే మక్కెలిరగ్గొట్టి మడతమంచంలో పెడదాం’ అని అన్నారు.

జగన్‌ బతుకు నాకు తెలుసు..

‘జగన్‌ బతుకు జూబ్లీ హిల్స్‌ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి తెలుసు.. అక్కడి చెక్‌పోస్టులో ఏం చేసేవారో నాకు తెలుసు.. బంజారాహిల్స్‌లోని కొంటికి రెస్టారెంట్‌లో ఏం చేసేవారో నాకు తెలుసు..’ అని పవన్‌కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘నా వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడుతుంటారు. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నులు టన్నులు ఉంది. ఇప్పటి వరకు నాలో మంచితనం చూశారు.. జగన్‌ మీకు యుద్ధం ఇస్తాను మర్చిపోకండి’ అని హెచ్చరించారు.

అమరావతే రాజధాని

అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్‌కల్యాణ్‌ ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి. రాజధాని వికేంద్రీకరణ కాదు. రాజధాని అంటే వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం. మూడు రాజధానులంటున్న మూడు ముక్కల ముఖ్యమంత్రి పాలనలో.. రాజధాని అంటే మూడుచోట్లకు పరిగెత్తాల్సి వస్తుంది’ అని విమర్శించారు. నేనున్నది యువతకు 25 కిలోల బియ్యం, రూ.5 వేలు ఇవ్వడానికి కాదు, పాతికేళ్ల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికే’ అని చెప్పారు. రూ.10 వేలు చేతిలో పెట్టడమా.. రూ.లక్ష సంపాదించే మార్గం చూపించడమా.. ఏది కావాలో యువత నిర్ణయించుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులున్నా పర్వాలేదా

‘మీరు ఉద్యోగానికి వెళ్లాలన్నా.. మీకు పాస్‌పోర్టు కావాలన్నా మీ ప్రవర్తనపై కాండక్ట్‌ సర్టిఫికెట్‌ కావాలి. కానీ ఒక ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులున్నా కాండక్ట్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. గూండా ఎమ్మెల్యేలు ఎన్ని దోపిడీలు చేసినా.. వారికీ అవసరం లేదు’ అని పవన్‌కల్యాణ్‌ దుయ్యబట్టారు.


పవన్‌కల్యాణ్‌ అంటే యువత కల..

‘పవన్‌ కల్యాణ్‌ అంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తు.. ఈ దేశపు యువత కలలు.. ప్రజల కన్నీళ్లు తుడిచే చేయి.. అర్ధరాత్రి పరుగెత్తుకొచ్చే అంబులెన్స్‌.. ఆడబిడ్డలకు రక్షణగా చేతికి కట్టే రాఖీ.. పెద్దోళ్ల భుజంపై ఉండే కండవా.. గర్వంతో ఎగిరే జాతీయ జెండా..’ అని అభివర్ణించిన ఆయన జగన్‌ను ఉద్దేశించి ‘మిమ్మల్ని నట్టేట ముంచే తుపాన్‌.. అథఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం.. గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు. ‘జగన్‌ భార్యను మేమెప్పుడూ మేడం భారతీ అంటాం.. జగన్‌ ఎంతో నీచంగా ప్రవర్తించారు. చంద్రబాబు సతీమణిని ఇబ్బంది పెట్టారు. నా సతీమణిని మాటలన్నారు. పెళ్లాలు అని సంబోధిస్తారు. అదేమాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు తెలుగు వచ్చు. సంస్కారంగా ఉండదని ఊరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘వైకాపా రౌడీలు, గూండాలు ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాల్ని ఆక్రమిస్తే జెండా మడతపెట్టి, ఆ కర్రతో ఎదుర్కోవాలనే జెండా సభ పెట్టాం’ అని పవన్‌ చెప్పారు.


మందుపాతర పేలినా.. పడిలేచిన చంద్రబాబు

‘మందుపాతర పేల్చితే.. 16 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినా.. పైకిలేచి దుమ్ము దులిపి.. పదండి వెళ్తామని అన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశంసించారు. ‘నవ నగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తీసుకువచ్చిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనతో పొత్తు పెట్టుకున్నా’ అని వివరించారు. ‘నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్ధండుణ్ని 53 రోజులు జైల్లో పెడితే.. ఆయన సతీమణిని అనకూడని మాటలంటే నిజంగా బాధేసింది’ అని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ‘చంద్రబాబు నుంచి కౌలు రైతుల వరకు, రాష్ట్రాన్ని వదిలి పోయిన పారిశ్రామికవేత్తల దాకా.. అందరి కష్టాలను చూశా. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను జగన్‌ మోసం చేశారు. వారి కోసం నిలబడాలనే నేనే కూటమిని ప్రతిపాదించా’ అని వివరించారు. ‘వ్యక్తి ప్రయోజనాల్ని ఆశించి నేనెప్పుడూ రాజకీయం చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే పొత్తు పెట్టుకున్నాం. ప్రజాస్వామ్యంలో సంఘర్షించాల్సిన, సహకరించాల్సిన పరిస్థితులు పక్కపక్కనే ఉంటాయి. 2024లో సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ‘తెలుగుదేశం, జనసేన సహకరించుకుంటేనే రాష్ట్రంలోని అయిదుకోట్ల ప్రజలకు భవిష్యత్తు. మనలో మనం కలహించుకుంటే. జగన్‌ మళ్లీ వచ్చి ప్రజలకు కంటకంగా మారతారు’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని