రైతులపై పగ పట్టకండి.. కోపం ఉంటే మాపై తీర్చుకోండి

మేడిగడ్డ బ్యారేజీలోని 85 పిల్లర్లలో ఒక పిల్లర్‌లో మాత్రమే సమస్య తలెత్తిందని, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తూ రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Updated : 02 Mar 2024 04:44 IST

వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలి
ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు
1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల పరిధిలోనే సమస్య
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
 ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు

ఈనాడు, పెద్దపల్లి; ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి; కాళేశ్వరం, మహదేవపూర్‌, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీలోని 85 పిల్లర్లలో ఒక పిల్లర్‌లో మాత్రమే సమస్య తలెత్తిందని, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తూ రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ 1.6 కిలోమీటర్ల పొడవు ఉండగా అందులో 50 మీటర్ల పరిధిలో మాత్రమే సమస్య ఉందని, దీనిని బ్రహ్మాండంగా పునరుద్ధరించి తిరిగి వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారని చెప్పారు. భారాస ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఆ పార్టీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబిత, శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఇంజినీరింగ్‌ నిపుణులు ప్రకాశ్‌, వెంకటేశ్‌, దామోదర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉదయమే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో బయల్దేరిన నేతలకు దారి పొడవునా భారాస శ్రేణులు స్వాగతం పలికాయి. భూపాలపల్లిలోని భారాస కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి నేతలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. బ్యారేజీ కిందకు దిగి 20వ పిల్లర్‌ వద్ద పరిశీలించారు. అక్కడ కేటీఆర్‌ నాలుగు నిమిషాలు ఉన్నారు. సాయంత్రం 5.40 గంటలకు అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుని దిగువ ప్రాంతాన్ని కొద్దిసేపు పరిశీలించిన అనంతరం సభాస్థలికి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద కొద్దిసేపు మీడియాతోనూ, అన్నారం సభలోను కేటీఆర్‌ మాట్లాడారు. చలో మేడిగడ్డ మొదటి సందర్శన అని త్వరలో మిగిలిన ప్రాజెక్టులను సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.

అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోండి

‘‘మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రైతులపై, రాష్ట్రంపై పగ పట్టకండి. నీళ్లు లేక ఇప్పటికే కరీంనగర్‌, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయండి. సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టండి. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోండి. వచ్చే వానాకాలంలో వరద వచ్చేనాటికి బ్యారేజీని పునరుద్ధరించండి. నీళ్లు ఎత్తిపోస్తే రైతులకు న్యాయం జరుగుతుంది.

కడెం ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది

ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమీ కాదు. కడెం ప్రాజెక్టు రెండు సార్లు, గుండ్లవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయాయి. సాగర్‌లో, శ్రీశైలంలో లీకేజీలు వచ్చాయి. కానీ మేం ఎప్పుడూ రాజకీయంగా మాట్లాడలేదు. 

రాజకీయ లబ్ధికి యత్నం

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేసి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌ నల్గొండలో సభ తలపెడితే అదే రోజు సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనను ఏర్పాటు చేశారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి మేము పిలుపునిస్తే వారు పాలమూరు-రంగారెడ్డి పథకం సందర్శన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. కామధేనువు లాంటి కాళేశ్వరానికి మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు మానుకుని తక్షణమే పునరుద్ధరణపై దృష్టి సారించాలి’’ అని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం ద్వారానే కొత్తగా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు: కడియం 

అన్నారం ప్రాజెక్టు వద్ద స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌’ ద్వారా కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని వివరించారు. కడియం మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా కొత్తగా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మడిహెట్టి వద్ద తలపెట్టిన ప్రాజెక్టుకు, భారాస చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న తేడాను డిజిటల్‌ తెరపై దాదాపు గంటసేపు వివరించారు. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే ప్రాణహిత- గోదావరి కలిసే ప్రాంతంలో దిగువన మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చిందన్నారు.

చలో మేడిగడ్డను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఈనాడు, వరంగల్‌: చలో మేడిగడ్డకు పలుచోట్ల నిరసనలు ఎదురయ్యాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పరిధిలో యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దేవన్నపేట క్రాస్‌ వద్ద స్థానిక కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున గుమిగూడి ‘గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి స్థానిక భారాస నేతలు కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్ది చెప్పి పంపించివేశారు.

పేలిన బస్సు టైరు

జనగామ జిల్లా నెల్లుట్ల క్రాస్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సుల్లో వెనకాల వస్తున్న ఒక బస్సు టైరు పేలింది. అందులో కొందరు భారాస నేతలు, విలేకరులు ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.


భారాస కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

మేడిగడ్డ బ్యారేజీ వద్దకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు బ్యారేజీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు నిలువరించారు. ప్రత్యేక బస్సుల్లో భారాస బృందం మేడిగడ్డకు చేరుకోగానే ఆ సమయంలోనే కార్యకర్తలు ఒక్కసారిగా బ్యారేజీ గేటు వద్దకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. గేటు దాటి లోపలికి వెళ్లడానికి మరోసారి తీవ్రమైన ప్రయత్నం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంత మంది కార్యకర్తలు కింద పడిపోయారు. భారాస బృందం వెళ్లడానికి బ్యారేజీ గేటు తీయడంతో ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులు పూర్తిగా పట్టు కోల్పోవడంతో భారాస కార్యకర్తలు బ్యారేజీపైకి చేరుకున్నారు. భారాస బృందం బ్యారేజీ దిగువకు చేరుకొని పరిశీలించింది.


పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు

మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంతో ఘనత ఉందని.. వరదలతో స్వల్పంగా కూలిన మేడిగడ్డ పిల్లర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి వచ్చే వానాకాలంలో రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగితే ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టలేదన్నారు. కుంగిన ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా ప్రజల దృష్టి మరల్చి కేసీఆర్‌ గొప్పతనాన్ని తగ్గించి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం ప్రకటించిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించి ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చిన వెంటనే మరమ్మతు చేయిస్తామని ప్రకటించారన్నారు. ‘‘భారాస ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పని చేస్తుంది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నష్టపోయినట్టు కాదు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణకు వెంటనే ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేస్తే సూచనలు ఇస్తాం.

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు...

అవినీతికి కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్‌ హయాంలో నాడు 33 ప్రాజెక్టులు జలయజ్ఞం అంటూ చేపట్టి ఒక్కటీ పూర్తి చేయకుండా ధనయజ్ఞంగా మార్చారు. రూ.1,450 కోట్ల దొంగ బిల్లులు సృష్టించిన చరిత్ర వారిది. తుమ్మిడిహెట్టి కోసం ఒప్పందం చేసుకోవడమే తప్ప తట్టెడు మట్టి ఎత్తలేదు. సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద నీటి నిల్వలు లేవు. వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇలాంటి కారణాలతోనే ప్రత్యామ్నాయంగా నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. భాజపా ప్రభుత్వం గుజరాత్‌లో చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని కూలిపోయాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో కొట్టుకుపోగా ఎన్‌డీఎస్‌ఏకు నివేదిస్తే ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు. మేడిగడ్డ కుంగిన రెండు రోజుల్లోనే నాణ్యత లోపాలతోనే కుంగిపోయిందని అది ప్రభుత్వానికి చెప్పకుండా మీడియాకు వెల్లడించడం రాజకీయ దురుద్దేశమే. నాగార్జున సాగర్‌ నుంచి కాళేశ్వరం వరకు ప్రాజెక్టుల అంచనా- ప్రతిపాదన- నిర్మాణ వ్యయాలకు మార్పులు ఉంటాయి’’ అని హరీశ్‌రావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు