ఎన్నికల బాండ్లు అతిపెద్ద కుంభకోణం.. విపక్షాల ధ్వజం

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు భాజపా అనుసరిస్తున్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేశాయని కాంగ్రెస్‌ శుక్రవారం ఆరోపించింది.

Updated : 16 Mar 2024 06:18 IST

దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు భాజపా అనుసరిస్తున్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేశాయని కాంగ్రెస్‌ శుక్రవారం ఆరోపించింది. క్విడ్‌ ప్రో కో, విరాళాలు ఇచ్చిన కంపెనీలకు రక్షణ, షెల్‌ కంపెనీల నుంచి హవాలా సొమ్ము అందుకోవడం వంటి భాజపా ప్రభుత్వ విధానాలు తేటతెల్లం అయినట్లు తెలిపింది. స్వతంత్ర భారతంలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాక భాజపా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోరింది.


అవినీతిని చట్టబద్ధం చేశారు

అధికార పార్టీని అతిపెద్ద లబ్ధిదారును చేస్తూ అవినీతిని చట్టబద్ధం చేసేందుకే ఈ ఎన్నికల బాండ్లను తీసుకువచ్చారు. ఈ పథకాన్ని ప్రకటించిన రోజే నేను ఆ విషయం చెప్పాను. అభ్యర్థులు ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ఈసీ అనుమతిస్తే, హాస్యాస్పదమైన తప్పుడు లెక్కలు చూపి గెలవాలని ఎవరూ అనుకోరు. 

పి.చిదంబరం (కాంగ్రెస్‌), మాజీ ఆర్థికమంత్రి


 మిగతా 3,346 బాండ్ల మాటేమిటి?

2018 నుంచీ మొత్తం 22,217 ఎన్నికల బాండ్లు జారీ అయ్యాయి. ఈసీ వెబ్‌సైటులో 18,871 బాండ్ల వివరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా 3,346 బాండ్లకు సంబంధించిన మొత్తం రూ.2,500 కోట్లు. మోదీ ప్రభుత్వం, ఎస్‌బీఐ ఎవరిని కాపాడాలని చూస్తున్నాయి?

అజయ్‌ మాకెన్‌, కాంగ్రెస్‌ కోశాధికారి


 సిట్‌తో దర్యాప్తు జరిపించాలి

ఎన్నికల బాండ్లు పరస్పరం లబ్ధి చేకూర్చే చట్టవిరుద్ధమైన పెద్ద కుంభకోణం. బాండ్ల ఐడీ నంబర్లను వెల్లడించి, ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే విషయం నిగ్గుతేల్చాలి. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఈడీ ప్రస్తుతం నిద్రాణస్థితిలో ఉన్నందున అది వెంటనే జరగకపోవచ్చు. ఈ వ్యవహారంపై కోర్టు నియమించిన అధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) స్వతంత్ర విచారణ జరపాలి. జాబితాలో పేర్లు లేని ఆ రెండు పెద్ద కంపెనీలకు అందులోని ఇతర కంపెనీలతో అనుబంధం ఉండవచ్చు.

కపిల్‌ సిబల్‌, సీనియర్‌ న్యాయవాది


 కేంద్ర సంస్థల దుర్వినియోగానికి ఇదే రుజువు

చరిత్రలో అత్యంత అవినీతిమయమైన రాజకీయ పార్టీ భాజపాయే అని ఎన్నికల బాండ్ల వివరాలు రుజువు చేశాయి. కేంద్ర దర్యాప్తుసంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలకు ఇపుడు విశ్వసనీయత పెరిగింది.

మనోజ్‌ ఝా, ఆర్జేడీ సీనియర్‌ నేత


సుప్రీం తీర్పును అణచివేసే ప్రయత్నం

ఎన్నికల బాండ్ల నంబర్లు కూడా వెల్లడించాలంటూ ఎస్‌బీఐని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. దీనిని బట్టి అత్యున్నత న్యాయస్థానం తీర్పును అణచివేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ల నుంచి నిధుల దోపిడీకి ఈడీ వంటి సంస్థలను ఉపయోగించినట్లు ఎన్నికల బాండ్ల సమాచారం చెబుతోంది. ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ఇటువంటి దుందుడుకు ప్రయత్నాలను అన్ని పార్టీలు, వర్గాలు, ప్రజలు ఖండించాలి.

 సీపీఎం పొలిట్‌బ్యూరో


భాజపా బండారం బట్టబయలు

తినను.. తిననివ్వను అని ప్రధాని చెబుతారు. భాజపా నోటికి మాత్రమే అందిస్తాను అన్నది ఆయన మాటల పరమార్థంగా ఇపుడు బోధపడింది. ఎన్నికల బాండ్ల పేరుతో భాజపా నిధులను ఎలా సేకరిస్తోందనే విషయాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టింది. భాజపాకు 50 శాతం, కాంగ్రెస్‌కు 11 శాతం విరాళాలు అందినట్లు ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది. అనుమానాస్పద దాతలు చాలామంది ఉన్నారు. వీరంతా అంత మొత్తంలో భాజపాకు నిధులు ఎలా సమకూర్చారు? విరాళాలు ఇచ్చినవారిలో ఎక్కువమంది ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కొన్నవారే. ఐటీకి అందిన ఆదేశాలతో రూ.300 కోట్ల మేర కాంగ్రెస్‌ ఖాతాలు స్తంభింపజేశారు. రూ.వందల కోట్లు అక్రమంగా సేకరించిన భాజపాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? త్వరలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై చర్చిస్తాం.

 మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని