జగన్‌ మీ దత్తపుత్రుడు కాదా?

ముఖ్యమంత్రి జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్‌ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Published : 18 Mar 2024 05:37 IST

కాంగ్రెస్‌పై ప్రధానివి పసలేని విమర్శలు
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్‌ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్‌ అరాచకాలను అడ్డుకోకుండా .. తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై షర్మిల సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆదివారం స్పందించారు. ‘ఏపీని నాశనం చేసుకోండి..ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరు? దత్తపుత్రుడు అన్నది ఎవరినో? ప్రతి బిల్లుకూ పార్లమెంట్‌లో సిగ్గువిడిచి భాజపాకు జగన్‌రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదా? రాష్ట్ర విభజనకు సంబంధించి హామీలు ఇచ్చింది కాంగ్రెస్‌ కాగా...వాటిని తుంగలో తొక్కింది భాజపా, తెదేపా, వైకాపా...ఇప్పుడు ఆ మోసాలను కప్పి పెట్టాలని కాంగ్రెస్‌ మీద పసలేని దాడులా? కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే అనే కాంగ్రెస్‌ వాగ్దానం మోదీకి వణుకు తెప్పిస్తోందా? పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి ఇప్పుడు కాంగ్రెస్‌పై దాడులా’ అని షర్మిల మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని