నేడు భాజపా గూటికి గాలి జనార్దనరెడ్డి

కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి సోమవారం భాజపాలో చేరనున్నారు.

Published : 25 Mar 2024 04:35 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి సోమవారం భాజపాలో చేరనున్నారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన పార్టీని భాజపాలో విలీనం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఒకసారి ఆయన భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి.శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. తాను భేషరతుగా భాజపాలో చేరుతున్నట్లు జనార్దనరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆయన చేరికతో బళ్లారి, కొప్పళ, రాయచూరు, గదగ, హావేరి జిల్లాల్లో పార్టీకి మరింత బలం వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. బెంగళూరులో తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనార్దనరెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం భాజపాలో చేరే విషయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దనరెడ్డి అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడ్డారని సీబీఐ అధికారులు 2011 సెప్టెంబరు 5న అరెస్టు చేశారు. జామీనుపై బయటకు వచ్చి రాజకీయాలలో కొనసాగినా, గతంలో వలే ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇప్పటికీ బళ్లారి జిల్లాలోకి అడుగు పెట్టకుండా సర్వోన్నత న్యాయస్థానం ఆయనపై ఆంక్షలు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని