సంక్షిప్త వార్తలు (10)

ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు సన్నాహాలు చేపట్టారు.

Updated : 28 Mar 2024 06:26 IST

దిల్లీలో ఇండియా కూటమి సభ విజయవంతానికి సన్నాహాలు

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు సన్నాహాలు చేపట్టారు. దీనికి సంబంధించి దిల్లీ, హరియాణా నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ ప్రతినిధి కూడా మహార్యాలీకి హాజరవుతారని విశ్వసనీయ సమాచారం.


పంజాబ్‌లో ఆప్‌ ఏకైక ఎంపీ భాజపాలో చేరిక

దిల్లీ: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ సుశీల్‌కుమార్‌ రింకూ బుధవారం భాజపాలో చేరారు. రింకూతో పాటు.. ఆప్‌ జలంధర్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే శీతల్‌ అంగురల్‌ కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. దిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ అరెస్టుతో సంక్షోభం ఎదుర్కొంటున్న ఆప్‌నకు ఈ పరిణామం మింగుడుపడనిదే.


బక్క జడ్సన్‌కు కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌కు పీసీసీ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో, ఛానళ్లలో బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే పార్టీ నియమ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలుతీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.


అధికారం కోసం జగన్‌ అడ్డదారులు
సీఈవోకు ఎన్డీయే నాయకుల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుపతి జిల్లా రేణిగుంటలో వైకాపా నేతలు దాచిన తాయిలాలను సీజ్‌ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, భాజపా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీ, తెదేపా అధికార ప్రతినిధి షేక్‌ రఫీ, తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘ఓటమి భయంతో జగన్‌ అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు. ఇతర గోదాముల్లో పెద్దఎత్తున గడియారాలు, కుక్కర్లు, గొడుగులు, ఫ్యాన్లు, చీరలతో పాటు మరికొన్ని వస్తువులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.

వైకాపా తాయిలాల డంప్‌ బయటపడ్డ విషయంలో స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా నాయకులు ఫిర్యాదు చేస్తే.. బుధవారం సాయంత్రం వరకు వస్తువుల విలువ లెక్కించకుండా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. తిరుపతి నగరవ్యాప్తంగా ఇలాంటి డంప్‌లు మరిన్ని ఉన్నట్లు పేర్కొన్నారు.


వైకాపా నాయకుడితో కలిసి బైబిళ్లు పంచిన వాలంటీర్లు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద వైకాపా నాయకుడితో కలిసి ఇద్దరు వాలంటీర్లు విద్యార్థులకు బుధవారం బైబిళ్లు పంపిణీ చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష కేంద్రంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల బయట రహదారిని ఆనుకుని ఓ దుకాణం వద్ద రంగాపురానికి చెందిన పాస్టర్‌, అమలాపురం మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు మొసలి స్పర్జన్‌రాజు (వైకాపా) క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా విద్యార్థులకు బైబిళ్లు ఇచ్చేందుకు వచ్చారు. పరీక్ష రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు వాటిని ఇస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ కూడా ఇక్కడ పంపిణీ సరికాదని సూచించడంతో స్పర్జన్‌రాజు అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావు పాల్గొన్నారు.


ఆటో డ్రైవర్లకు వైకాపా ప్రలోభాలు

విశాఖపట్నం (ఎంవీపీకాలనీ), న్యూస్‌టుడే: విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆటోడ్రైవర్లను వైకాపా కార్యాలయానికి పిలిపించి.. ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెదేపా వస్తే మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందని చెప్పి.. వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ సీట్ల సర్దుబాటుపై రేపు నిర్ణయం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఈనెల 29న ఓ కొలిక్కి రానుంది. అదే రోజు హైదరాబాద్‌లో మూడు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆయా మూడు పార్టీల నాయకులు విజయవాడలో ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపైనా ప్రాథమికంగా చర్చించారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించే సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొప్పులరాజు, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.


వైకాపా హయాంలో గిరిజన మహిళలపై పెరిగిన దాడులు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో గిరిజన మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రశ్నించిన మహిళపై.. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైకాపా నాయకులకు మహిళలను అవమానించడం పరిపాటిగా మారింది. ఇటీవల పల్నాడు జిల్లాలో తాగునీరు అడిగిన గిరిజన మహిళ సామునిభాయిని ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. మహిళలకు అన్యాయం జరిగితే బుల్లెట్‌ కంటే ముందు జగన్‌ వస్తాడన్న వైకాపా నేతలు వీటికి ఏం సమాధానం చెబుతారు?’ అని సంధ్యారాణి ప్రశ్నించారు.


కంటెయినర్‌ వచ్చి వెళ్లడంపై విచారణ చేపట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

ఈనాడు, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్‌ అక్రమంగా వచ్చి వెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ‘భద్రతా సిబ్బంది రికార్డుల్లో నమోదు కాకుండా ఒక కంటెయినర్‌ సీఎం క్యాంపు కార్యాలయంలోకి రాంగ్‌రూట్‌లో వెళ్లడం, రెండో చెక్‌ పోస్టు వద్ద ఉండే ఆటోమేటిక్‌ స్కానర్‌ నుంచి కాకుండా వేరే దిశలో కంటెయినర్‌ను పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎం జగన్‌ పర్యటనల సందర్భంగా పరదాలు, ముళ్లకంచెలు కట్టి అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసు అధికారులు... కంటెయినర్‌పై ఏం సమాధానం చెబుతారు? ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ప్రతిపక్షాల వాహనాల్ని పదేపదే తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలను పట్టించుకోక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.


పురందేశ్వరి ప్రతిష్ఠ దెబ్బతీసేలా సజ్జల భార్గవ్‌ తప్పుడు ప్రచారం
భాజపా నేత షేక్‌ బాజీ మండిపాటు

ఈనాడు, అమరావతి: భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైకాపా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీ మండిపడ్డారు. ‘పురందేశ్వరి, తెలుగుదేశం’ అనే పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా సృష్టించి, దాంతో తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షేక్‌ బాజీ విలేకర్లతో మాట్లాడుతూ.. వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతుల్లో ఉండగా.. ఎన్నికల్లో వారిని ఉపయోగించుకునేందుకు వైకాపా ప్రభుత్వం వారితో రాజీనామా చేయించాలని కుట్ర పన్నుతోందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని