ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర.. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు

భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Updated : 28 Mar 2024 06:23 IST

 

లేబర్‌కాలనీ (వరంగల్‌), హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త కొండా మురళీధర్‌రావుతో పాటు తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని నిజాలు బయటికి వస్తాయని, ట్యాపింగ్‌లో కీలక భూమిక పోషించిన పోలీసులతో పాటు తెరవెనుక ఉన్న పెద్దలను ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. వరంగల్‌లోని (తూర్పు ఎమ్మెల్యే) క్యాంపు కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకలాపాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాజపాకు వాటా ఉంది. మేఘా కృష్ణారెడ్డి భాజపాకు రూ. వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. అందుకే కమలం పార్టీ కాళేశ్వరంపై నోరుమెదపడం లేదు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కుమార్తె హోదాలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ దందా చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్‌ కుటుంబం రూ.కోట్లకు పడగలెత్తింది’’ అని సురేఖ ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ శాఖ భూములను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు.

కేసీఆర్‌, కేటీఆర్‌లకు శిక్ష తప్పదు: ఎమ్మెల్యే యెన్నం

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ఆదేశాల మేరకే అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. తన ప్రమేయం లేకపోతే కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ కేసులో ‘సిట్‌’ లోతైన దర్యాప్తు చేయాలి. నేనూ బాధితుడినే. ప్రతి నియోజకవర్గంలో బాధితులున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేయాలి. తెలంగాణలో నిఘా వ్యవస్థ దుర్వినియోగం కేంద్రానికి తెలియకుండానే జరిగిందా? రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అణచివేసేందుకు భాజపా, భారాస కలిసి కుట్ర చేశాయి. అయినా ఆ పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు. కవిత జైలుకు వెళితే, ఎమ్మెల్సీ సీటు కోసం కేటీఆర్‌ గోవాలో క్యాంపు ఏర్పాటుచేసి చిందులేశారు’’ అని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని