మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Updated : 28 Mar 2024 04:14 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచనున్నారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి(భారాస), సుదర్శన్‌గౌడ్‌(స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా బుధవారం కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్‌ సమయానికి కేంద్రాలకు వచ్చేలా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని