కేసుల్లోనూ నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి జగనే

దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్‌.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Published : 28 Mar 2024 05:20 IST

తెదేపా మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్‌.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైల్లో ఉంటే, మద్యం వ్యాపారంలో   రూ.లక్షల కోట్లు దోచుకున్న జగన్‌ మాత్రం బయట తిరుగుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి పన్నుల పేరుతో రూ.వందలు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వైకాపా ప్రభుత్వం పెంచింది. ఏకంగా తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్‌కు అయిదేళ్లు ప్రజల కష్టాలు కనపడలేదు. వినపడలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలను విస్మరించారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్‌ మడమ తిప్పడంలో తనకు సరిలేరనేలా పాలన కొనసాగించారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక మద్యం మాఫియాను పెంచి పోషించారు. కల్తీ మద్యంతో వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. మరికొన్ని వేలమంది అనారోగ్యం పాలవడానికీ ఆయనే కారణం. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో మద్యం వ్యాపారాన్ని కొనసాగించేలా అప్పులు తెచ్చారు. ఆయన ఆస్తుల్లాగే డ్రగ్స్‌లో కూడా రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపారు. గతంలో విజయవాడ చిరునామాతో గుజరాత్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కంటెయినర్‌, ఇప్పుడు విశాఖలో డ్రగ్స్‌తో దొరికిన కంటెయినర్‌కు పాత్రధారులు, సూత్రధారులు వైకాపా నాయకులే’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని