లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు

ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్‌ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి.

Published : 28 Mar 2024 05:21 IST

4, 8 తేదీల్లో నిర్వహణ
అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, మనోహర్‌ల భేటీలో నిర్ణయం

ఈనాడు, అమరావతి: ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్‌ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయం లక్ష్యంగా ఈ సమావేశాల్ని నిర్వహించనున్నారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాసంలో బుధవారం రాత్రి జరిగిన మూడు పార్టీల ముఖ్యనేతల సమావేశం జరిగింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు, భాజపా నుంచి పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి అరుణ్‌సింగ్‌, సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థసింగ్‌, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌ పాల్గొన్నారు. రెండు గంటలపాటు సమావేశంలో... ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టో రూపకల్పన, మూడు పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు.. తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.

వారిపై ఫిర్యాదు చేయాలి

కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా రాష్ట్రంలో కొందరు అధికారులు వైకాపాకు కొమ్ముకాస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు భాజపా నేతల దృష్టికి తెచ్చారు. అలాంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని, జగన్‌ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామనే భరోసాను ప్రజలకు భాజపా ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల సభల గురించి చర్చకు వచ్చినప్పుడు... ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున, రాష్ట్రంలో మూడు సభలకు హాజరయ్యే అవకాశం ఉందని భాజపా నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకొస్తే ప్రజలకు లభించే భరోసా, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఉమ్మడిగా కరపత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మూడు పార్టీల నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు

‘కేంద్రంలో 400 లోక్‌సభ స్థానాలు, రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఎన్డీయే అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అభివృద్ధి పరుగు పెడుతుంది. వైకాపా పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా మూడు పార్టీలూ కలిసి పనిచేస్తాయి’ అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రచురించాల్సిన కరపత్రాలు, రూపొందించాల్సిన నినాదాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించినట్లు మనోహర్‌ వెల్లడించారు. ‘క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్‌ 4, 8 తేదీల్లో జరిగే సమావేశాల్లో అన్ని అంశాల్నీ సమన్వయం చేసుకుని, ఉమ్మడిగా ప్రజల్లోకి వెళతాం. అభివృద్ధే ధ్యేయంగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో కూటమి ప్రజల వద్దకు వెళుతోంది. వారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అని పురందేశ్వరి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని