పెండింగ్‌ స్థానాలపై కాంగ్రెస్‌ దృష్టి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 29 Mar 2024 06:27 IST

దీపా దాస్‌మున్షీతో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ
ఈ నెల 31లోగా అభ్యర్థుల ఎంపికను కొలిక్కితెచ్చే యత్నం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని భావించినా నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే ప్రకటించింది. పెండింగ్‌లో ఉంచిన ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలపై మరోసారి సర్వే చేసి తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 31న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) మరోసారి సమావేశం కానుంది. ఆ సమావేశంలోగా పెండింగ్‌ సీట్లను కొలిక్కితెచ్చేలా ఏఐసీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆశావహుల మధ్య సయోధ్య కుదిరేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ హరీశ్‌ చౌధరి, సభ్యులు గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీతో నగరంలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు రోహిత్‌ చౌధరి, విష్ణునాథ్‌ ఇందులో పాల్గొన్నారు. పెండింగ్‌ స్థానాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల దీపా దాస్‌మున్షీ గాంధీభవన్‌లో నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్యనేతలు, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను హరీశ్‌ చౌధరి బృందం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సర్వే వివరాలు, ఆశావహుల బలాబలాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్‌కమిటీ ఛైర్మన్‌ హరీశ్‌ చౌధరిని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్‌ గురువారం రాత్రి విడివిడిగా కలిసి అభ్యర్థుల ఎంపికపై తమ అభిప్రాయాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని