సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి

పాస్‌ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్‌ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ కోరారు.

Published : 29 Mar 2024 05:24 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎంఏ షరీఫ్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాస్‌ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్‌ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ కోరారు. సంబంధిత అధికారిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు గురువారం లేఖ రాశారు.  వేరువేరు అంశాలపై కూడా ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖలు రాశారు. జగన్‌ ఫొటోలను ఎలక్షన్‌ కమిషన్‌ తొలగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఇలా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో వక్ఫ్‌ బోర్డుకు చెందిన ఈద్గా మసీదుకు కేర్‌ టేకింగ్‌ కమిటీ నియామకం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు. ‘గుంటూరు నగరంలోని వక్ఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వక్ఫ్‌ బోర్డు సీఈవోపై చర్యలు తీసుకోండి’ అని మరో లేఖలో షరీఫ్‌ కోరారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ వైకాపా కోసం పనిచేస్తున్న ఏపీఎండీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ హేమంత్‌కుమార్‌రెడ్డిని విధుల్లోంచి తొలగించాలని కోరారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌నూ బదిలీ చేయాలని కోరారు. మంగళగిరిలో విలేకర్లతో మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించి సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్‌ వెళ్లిన వ్యవహారంపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఎంఏ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు