ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా

‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్‌ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా.

Updated : 29 Mar 2024 08:20 IST

పీలీభీత్‌ ప్రజలకు వరుణ్‌గాంధీ లేఖ

లఖ్‌నవూ: ‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్‌ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. ఒక కుమారుడిగా సేవలు అందిస్తా’’ అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ నియోజకవర్గ ప్రజలకు సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ భావోద్వేగపూరితమైన లేఖ రాశారు. గురువారం ‘ఎక్స్‌’ వేదికగా లేఖను ఆయన పంచుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తన తల్లి మేనకాగాంధీ, వరుణ్‌గాంధీలకు పీలీభీత్‌ నియోజకవర్గం కంచుకోటగా నిలిచింది. భాజపా ఎంపీగా ఉంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్నారన్న కారణంగా అధిష్ఠానం ఈసారి వరుణ్‌ను కాదని, రాష్ట్ర మంత్రి జితిన్‌ ప్రసాదకు ఈ నియోజకవర్గ టికెటును కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పీలీభీత్‌ ప్రజలకు లేఖ రాశారు. వరుణ్‌గాంధీ నామినేషన్లకు దూరంగా ఉండిపోవడంతో ఆయన ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతారన్న ఊహాగానాలకూ తెరపడింది. యూపీలోని సుల్తాన్‌పుర్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మేనకాగాంధీకి మాత్రం భాజపా అధిష్ఠానం మళ్లీ టికెటు కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని