కాంగ్రెస్‌ ఒత్తిళ్లతో వణికిపోతున్న బడా వ్యాపారులు

రాష్ట్రంలో బడా వ్యాపారులు కాంగ్రెస్‌ అంటే వణుకుతున్నారని... నేరుగా దిల్లీలో ఆర్‌జీటీ (రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌) చెల్లించేలా నేతలు ఒత్తిడి చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 30 Mar 2024 04:40 IST

భారాస అడుగు జాడల్లోనే నడుస్తున్న పాలకపక్షం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బడా వ్యాపారులు కాంగ్రెస్‌ అంటే వణుకుతున్నారని... నేరుగా దిల్లీలో ఆర్‌జీటీ (రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌) చెల్లించేలా నేతలు ఒత్తిడి చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ అడుగు జాడల్లోనే నడుస్తూ దోపిడీకి తెరలేపిందన్నారు. రాష్ట్రంలోని రియల్టర్లు, పరిశ్రమల యజమానులు, వ్యాపారవేత్తలను బెదిరిస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఒంటికాలిపై లేచిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క మంత్రి అవినీతిపైనా విచారణ జరిపించడం లేదన్నారు. వారిని లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారని...ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం అవినీతి వ్యవహారం కంచికి చేరినట్లేనని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు ఉపయోగించిన పరికరాలపై దృష్టి సారిస్తున్నారే తప్ప... దీనిద్వారా ఎంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారులు, సినీ పరిశ్రమకు చెందిన వారిని బెదిరించి డబ్బు దండుకున్నారో నిగ్గు తేల్చడం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, సరైన సమయంలో బాధ్యులపై చర్యలకు వెనుకాడబోదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు ఛాయలు అలముకున్నాయని, చెరువులు, బోర్లలో నీటిమట్టాలు పడిపోవడంతో పంటలకు నీరందివ్వని పరిస్థితి నెలకొందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా వైపే అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాష్ట్రంలో 12 స్థానాలకుపైగా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలోనూ భాజపా గెలుపొందేందుకు ప్రణాళికలతో ముందుకెళుతున్నామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బంగారు శృతి, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు