ఎన్నికల విధుల నుంచి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలను తప్పించాలి

ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులను నియంత్రించడంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు విఫలమయ్యారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Published : 30 Mar 2024 05:04 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులను నియంత్రించడంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు విఫలమయ్యారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు శుక్రవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న చిలకలూరిపేటలోని బొప్పూడిలో తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సభకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం, మాచర్లలో తెదేపా నాయకుడి వాహనంపై వైకాపా మూకల రాళ్ల దాడి, గిద్దలూరులో తెదేపా కార్యకర్త మునయ్య హత్య సహా పలు అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. అనంతరం తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ, పార్టీ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని తెదేపా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సమావేశం పెట్టాలనుకోవడం కోడ్‌ ఉల్లంఘనే. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ కొన్న బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను వాడుతున్నారు. తక్షణం ఆ బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలి. ఎన్నికల్లో పంచడానికి వైకాపావారు దాచిన భారీ డంప్‌ తిరుపతి జిల్లాలో దొరికినా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. తిరుపతి జిల్లా కలెక్టర్‌ వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరాం’ అని వర్ల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని