‘వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే తిరిగి విదేశాలకు వెళ్లలేరు’

‘ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం.. వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’ అని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు హెచ్చరించారు.

Updated : 30 Mar 2024 06:06 IST

ప్రవాస భారతీయులకు వైకాపా అభ్యర్థి అశోక్‌బాబు హెచ్చరిక

వేమూరు, న్యూస్‌టుడే: ‘ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం.. వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’ అని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు హెచ్చరించారు. అమృతలూరు మండలం కూచిపూడిలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో అశోక్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా.. బరిలో నిలిచిన అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయి. కానీ, అధికార పార్టీ అభ్యర్థి కావటంతో అధికారులు చూసీచూడనట్లు మిన్నకుండిపోయారు. ఇప్పటి వరకూ ఆ వ్యాఖ్యలపై కనీసం ఆరా కూడా తీయలేదు.

‘‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. తెదేపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైకాపా కార్యకర్తలు, నాయకుల వ్యవహారం చూస్తామని వారు బెదిరిస్తున్నారు. అదే.. వైకాపా అధికారంలోకి వస్తే అంతకు రెండింతలు చేస్తాం. వేమూరు నియోజకవర్గంలో గతంలో ఏ సంస్కృతి ఉందో నాకైతే తెలియదు. ఈసారి మాత్రం చాలా కఠినంగా ఉంటాం. మేము కూడా దేనికైనా సిద్ధం. ఎవరి ఓటు వారు వేసుకోవడానికి మీకు దమ్ము, సత్తా ఉందా? అని తెదేపా నాయకులను ఉద్దేశించి అశోక్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కొల్లూరు మండలంలో కొందరు నాయకులు కులాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైకాపాలో అభ్యర్థి ఎవరనేది చూడటం లేదు, ఒక్క జగన్‌మోహన్‌రెడ్డినే చూసి ఓట్లేస్తారని అన్నారు. నియోజకవర్గంలోని చుండూరు మండలంలోని వైకాపా నాయకుల మధ్య అభిప్రాయ బేధాలున్నాయన్నది అవాస్తవమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని