ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

Updated : 30 Mar 2024 06:41 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ

దిల్లీ: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవిష్యత్తును మార్చగలరని వ్యాఖ్యానించారు. ‘ఎక్స్‌’లో ఈ మేరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘దేశ జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నారు. ఉన్నత విద్యాభ్యాసకుల్లోనూ వారు 50 శాతం ఉన్నారు. మరి వ్యవస్థలో వారి వాటా ఎందుకు తక్కువగా ఉంది? మహిళలకు పూర్తి హక్కులు ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయడానికి తాము సుముఖంగా ఉన్నామని తెలిపారు. ‘నారీ న్యాయ్‌’లో భాగంగా ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష ప్రత్యక్ష నగదు అందిస్తామన్నారు. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాలకు కేంద్రం సాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. మహిళలకు విద్యను అందించడానికి, చట్టపరమైన హక్కుల అమల్లో వారికి సహాయం చేయడానికి ప్రతి పంచాయతీలో ఒక ‘అధికార్‌ మైత్రి’ని నియమిస్తామని తెలిపారు. సావిత్రీబాయి ఫులే వసతిగృహాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక వసతిగృహాన్ని కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని