పోటీ చేసేందుకు అభ్యర్థుల్లేని కాంగ్రెస్‌

సత్యదూరమైన మాటలతో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ అన్నారు.

Published : 31 Mar 2024 04:06 IST

భారాస ఎమ్మెల్యే వివేకానంద్‌

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: సత్యదూరమైన మాటలతో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. కేసీఆర్‌ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన మాటలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు గుర్తు చేస్తా. అవసరమైతే ముఖ్యమంత్రికి భట్టి శిక్షణ తరగతులు నిర్వహించవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేక కాంగ్రెస్‌.. భారాస నాయకుల్ని తీసుకుంటోంది. కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కిందటేడాది డిసెంబరు 9న చేస్తామన్న రూ.2లక్షల రుణమాఫీ ఏమైంది? ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్‌ రాకముందే హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి. సీఎం బాధ్యతతో ప్రజా సమస్యలు పరిష్కరించాలి’’ అని అన్నారు.

అవకాశం ఇస్తే వరంగల్‌ నుంచి పోటీకి సిద్ధం: ఎర్రోళ్ల

భారాసలో పదవులు అనుభవించి పార్టీ మారుతున్న వారు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ అవకాశం ఇస్తే వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని