లోక్‌సభ ఎన్నికల్లో హస్తానికి పోటీ లేదు

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పోటీ లేదని.. ఎన్నికల తర్వాత భారాస కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు.

Published : 31 Mar 2024 04:08 IST

నల్గొండ సమావేశంలో నాయకుల వెల్లడి

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, హుజూర్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పోటీ లేదని.. ఎన్నికల తర్వాత భారాస కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. కుంభకోణాలు, ఫోన్‌ ట్యాపింగ్‌లతో గత భారాస ప్రభుత్వం పాలనలో విఫలమైందని, హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నల్గొండ లోక్‌సభ స్థానంలో పార్టీ సన్నాహక సమావేశాన్ని శనివారం హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో.. నల్గొండ లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని గెలిపించడానికి అంతగా కృషి చేయాలని ఈ సందర్భంగా దీపా దాస్‌మున్షీ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీ సాధనకు ప్రయత్నిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చినా పాతవారికి అన్యాయం జరగదని పేర్కొన్నారు.  

కేసీఆర్‌ వల్లే ఉమ్మడి నల్గొండకు కరవు: కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కారణంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాకు కరవు వచ్చిందని.. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఆయన నల్గొండకు వస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. తనను ఆదరించిన విధంగానే తన కుమారుడు, పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌ని గెలిపించాలని కోరారు. అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్‌, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పర్యాటక సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని