మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం: భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated : 31 Mar 2024 09:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపా ఎమ్మెల్యేల్లో ఒకరిని ముట్టుకున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 48 గంటల్లోపు కూలిపోతుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులే భాజపాతో టచ్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వారికి (కాంగ్రెస్‌కు) ఉన్నదే 64 మంది ఎమ్మెల్యేల బలం. సభలో మెజార్టీకి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కన్నా ఐదుగురు మాత్రమే అధికంగా ఉన్నారు. మేం మీలా గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. భాజపా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా సహకరిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరు మా నేతలను కలిసి శిందేలా మారుతానని అన్నారు కదా? కానీ మీపై మాకు నమ్మకం లేదు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘మీ తమ్ముడే మీతో టచ్‌లో లేరు. ఆయన భార్యకు భువనగిరి ఎంపీ టికెట్‌ రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

రేవంత్‌కు ఓటుకు నోటు భయం

ఓటుకు నోటో, మరో అంశమో తన పదవికి ప్రమాదం తెస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టడం లేదని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో 10 మంది మంత్రులు ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని వ్యాఖ్యానించారు. ‘‘రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని గతంలో మీరు అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటున్న మిమ్మల్ని ఇప్పుడేం చేయాలి?’’ అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై గతంలో అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనకి కాంగ్రెస్‌ టికెట్‌ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? విచారణల పేరుతో భయపెట్టి రాష్ట్రంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. మీ వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు