కార్గోలో వైకాపా ప్రచార సామగ్రి రవాణా

గుంటూరు నుంచి అనంతపురానికి అనుమతులు లేకుండా రవాణా అవుతున్న వైకాపా ప్రచార సామగ్రిని తెదేపా నాయకులు శనివారం రాత్రి గుర్తించి అడ్డుకున్నారు.

Published : 31 Mar 2024 04:50 IST

గుర్తించి అడ్డుకున్న తెదేపా నాయకులు

గుంటూరు (పట్నంబజారు), న్యూస్‌టుడే: గుంటూరు నుంచి అనంతపురానికి అనుమతులు లేకుండా రవాణా అవుతున్న వైకాపా ప్రచార సామగ్రిని తెదేపా నాయకులు శనివారం రాత్రి గుర్తించి అడ్డుకున్నారు. తాడేపల్లికి చెందిన కొందరు వైకాపా నాయకులు వాటిని గుంటూరు ఆర్టీసీ బస్టాండులోని కార్గోలో మధ్యాహ్నం సమయంలో బుక్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని వీటికి అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. ఎవరు బుక్‌ చేశారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పేందుకు కార్గో సిబ్బంది నిరాకరించారు. విషయం తెలుసుకున్న పాతగుంటూరు పోలీసులు బస్టాండుకు చేరుకొని 19 బస్తాలను పరిశీలించగా వాటిలో చేతికి వేసుకునే వైకాపా స్టిక్కర్లు, సెల్‌ఫోన్ల వెనుక అంటించుకునే స్టిక్కర్లు, జగన్‌ కోసం సిద్ధ అని స్టిక్కర్‌ ముద్రించిన చేతిసంచులు ఉన్నట్లు గుర్తించారు. పాతగుంటూరు పోలీసులు పార్సిల్‌ బుక్‌చేసిన వారికి ఫోన్‌చేసి వీటి గురించి వాకబు చేయగా తాము వచ్చి అన్ని పత్రాలూ చూపిస్తామన్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అక్కడికి చేరుకొని విచారించారు. వైకాపా నుంచి ఒకరు వచ్చి కేవలం సామగ్రి ఇన్‌వాయిస్‌లు మాత్రమే చూపించారు. ప్రచార సామగ్రి రవాణాకు ఆర్వో అనుమతి లేకపోవడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వాటిని పోలీసులకు అప్పగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని