జనసేనాని వారాహి యాత్రకు అడ్డంకులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయభేరికి తొలిరోజే అడ్డంకులు ఎదురయ్యాయి.

Published : 31 Mar 2024 04:51 IST

నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సభ

ఈనాడు, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయభేరికి తొలిరోజే అడ్డంకులు ఎదురయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం సాయంత్రం 4గంటలకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సభ జరుగుతుందని తొలుత ప్రకటించారు. కార్యక్రమానికి 48 గంటలముందే వారాహి వాహనం అనుమతికి సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసినా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని జనసేన నాయకులు ఆరోపించారు. వాహనానికి పిఠాపురంలోని శక్తిపీఠం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించాలి. అనుమతి లేక ఈ కార్యక్రమాన్ని సాయంత్రానికి వాయిదా వేయాల్సి వచ్చింది. సాయంత్రం 7 గంటలకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక కుమారపురం నుంచి 10 కి.మీ. కారులో వచ్చిన పవన్‌కల్యాణ్‌, చేబ్రోలు శివాలయం వద్ద వారాహి వాహనం ఎక్కి అభివాదం చేస్తూ రాత్రి 8.30 గంటలకు సభాప్రాంగణానికి చేరుకున్నారు. నాలుగున్నర గంటలపాటు వేలమంది ప్రజలు పవన్‌ రాక కోసం నిరీక్షించారు. పోలీసులు, అధికారులు కావాలనే అడ్డుకున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. దీంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ స్పందించి.. వారాహికి ఎన్నికల సంఘం అనుమతులు ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా రాష్ట్రవ్యాప్తంగా తిరగడానికి అనుమతినిచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని