ఈసీ ఆదేశాలకు పార్టీ రంగు అంటగడుతూ!

ఎన్నికలు ముగిసేవరకూ ప్రభుత్వ పథకాల నగదు పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే.. దానికి పార్టీ రంగు పులిమేందుకు వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కుట్రపన్నింది.

Updated : 31 Mar 2024 06:11 IST

వైకాపా సోషల్‌ మీడియా విభాగం బరితెగింపు

ఈనాడు, అమరావతి, గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికలు ముగిసేవరకూ ప్రభుత్వ పథకాల నగదు పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే.. దానికి పార్టీ రంగు పులిమేందుకు వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కుట్రపన్నింది. వాలంటీర్లు పింఛను పంపిణీ చేయొద్దంటూ ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయో లేదో.. ఎంఎల్‌ఓ (మండల లెవల్‌ అధికారులు)లను వైకాపా రంగంలోకి దింపింది. దీన్నింతటినీ తెదేపాకు అంటగట్టి పింఛనుదారులకు ప్రచారం చేయాలని వాలంటీర్లకు వాట్సప్‌ సందేశాలు పంపేలా కుట్ర పన్నుతోంది.

సచివాలయ ఉద్యోగులతో పంపిణీ?

రాష్ట్రంలోని ఒక్కో సచివాలయం పరిధిలో 250 నుంచి 300 వరకు పింఛనుదారులుంటారు. చిన్న గ్రామాల పరిధిలో అంతకంటే తక్కువగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో మాత్రమే వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టింది. ఈ సమయంలో సచివాలయ ఉద్యోగులను ఉపయోగించి ప్రభుత్వం నిర్దేశించిన 5 రోజుల సమయం కంటే ముందుగానే పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణీ చేయొచ్చు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ ఇప్పటికే చర్యలూ తీసుకుంది. పింఛను మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటివద్దనే ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆ శాఖ నుంచి వివరణ తీసుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇది తెలిసే ఉద్దేశపూర్వకంగానే వైకాపా తప్పుడు ప్రచారానికి తెర తీసింది.

సెర్ప్‌ అధికారుల అత్యుత్సాహం

వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల నగదు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండానే సెర్ప్‌ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వాలంటీర్లతోనే పింఛన్ల పంపిణీ చేయించాలని ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా వారు అనుమతి తీసుకోనట్టు తెలిసింది. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగంగానే ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సెర్ప్‌ అధికారులు ఇలా చేశారనే చర్చ శాఖలో నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని