కచ్చతీవుపై రాజకీయ రగడ

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు అంశాన్ని భాజపా తెరపైకి తీసుకొచ్చింది. 1974లో దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని ఆరోపించింది.

Updated : 01 Apr 2024 06:07 IST

కాంగ్రెస్‌ది దేశద్రోహమంటూ మోదీ ఆరోపణ
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే రాజకీయం: ఖర్గే
బంగ్లాదేశ్‌కు మీరిచ్చిన ప్రాంతాల మాటేమిటంటూ ఎదురుదాడి

దిల్లీ/మేరఠ్‌: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు అంశాన్ని భాజపా తెరపైకి తీసుకొచ్చింది. 1974లో దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని ఆరోపించింది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ ర్యాలీలోనూ కచ్చతీవును మోదీ ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌పై, డీఎంకేపై ధ్వజమెత్తారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉంది. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైంది. కానీ కాంగ్రెస్‌ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసింది. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాం. తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు లంక అధికారులు అరెస్టు చేస్తున్నారు. బోట్లను జప్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు’’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు 1974లో కచ్చతీవును ఇందిర ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై సమాచారహక్కు చట్టం ప్రకారం సేకరించిన సమాచారం ఆధారంగా ఓ పత్రిక రాసిన కథనాన్ని మోదీ ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు. ‘‘కచ్చదీవిని కాంగ్రెస్‌ ఎలా నిర్లక్ష్యంగా వదిలేసిందో తెలియచెప్పే కొత్త వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇది ప్రతీ భారతీయుడిలోనూ ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్‌ను ఎన్నడూ విశ్వసించకూడదన్న నమ్మకం మరోసారి వారిలో బలపడింది’’ అని ఆ కథనాన్ని ఉటంకిస్తూ మోదీ పేర్కొన్నారు. ప్రధాని ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కచ్చతీవును వెనక్కి తెచ్చుకొనేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో 20 మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా.. చైనాకు మోదీ ఎలా క్లీన్‌చిట్‌ ఇచ్చారని నిలదీశారు. ‘‘మీ హయాంలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు ఒప్పందం జరిగింది. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా 55 ప్రాంతాలు భారత్‌కు వస్తే, 111 ప్రాంతాలు బంగ్లాకు వెళ్లాయి. అలాంటి ఒప్పందంలో భాగంగానే నాటి ప్రభుత్వం శ్రీలంకకు కచ్చతీవును అప్పగించింది’’ అని ఖర్గే పేర్కొన్నారు.


అవినీతిపరులను వదిలిపెట్టను

దేశాన్ని దోచిన అవినీతిపరులను రక్షిస్తోందంటూ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిపరులెంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. దోపిడీదారులను రక్షించడానికే ఇండియా కూటమి ఏర్పడిందని విమర్శించారు. కూటమిని చూసి తాను భయపడనని.. తనకు భారతదేశమే కుటుంబమని చెప్పారు. దిల్లీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ విపక్షాలు ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను దేశాన్ని రక్షించటానికి పెద్ద యుద్ధం చేస్తున్నాను. అందుకే అవినీతిపరులంతా కటకటాల వెనక ఉన్నారు. సుప్రీంకోర్టులో కూడా వారికి బెయిల్‌ రావడం లేదు. అవినీతిపరులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు నాపై ఎంత తీవ్రస్థాయిలో దాడి చేసినా.. అగను. దోచిన దేశం సొమ్మును తిరిగివ్వాల్సిందే’’ అని ప్రధాని పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు