రైతన్నల నిరసన ‘బరి’!

దేశంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ సమస్యలపై వివిధ రంగాల వారు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉంటారు.

Published : 01 Apr 2024 05:48 IST

పలు సందర్భాల్లో లోక్‌సభ ఎన్నికల పోటీలో మూకుమ్మడిగా నిలిచిన అన్నదాతలు
1996లో తమిళనాడులోని మొదకురిచిలో అత్యధికంగా 1,033 మంది
గత ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి 176 మంది రైతుల పోటీ

దిల్లీ: దేశంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ సమస్యలపై వివిధ రంగాల వారు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉంటారు. కొందరు ధర్నాలకు దిగితే.. మరి కొందరు బంద్‌లు చేస్తారు. మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తారు. ఆమరణ నిరాహారదీక్షలకు దిగుతుంటారు. ఇంకా కొందరు ఒక అడుగు ముందుకేసి ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేయడంద్వారా నిరసన తెలియజేస్తుంటారు. ఇలా పలు సందర్భాల్లో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయడంద్వారా దేశం దృష్టిని ఆకర్షించి తమ సమస్యలను చాటి చెప్పారు. ఇలా తమ డిమాండ్లను గుర్తు చేయడానికి రైతన్నలూ ఎన్నికల్లో పోటీ చేశారు.

  • దేశంలోనే అత్యధికంగా 1996లో అప్పటి మొదకురిచి లోక్‌సభ నియోజకవర్గం (తమిళనాడు) నుంచి వేయి మందికిపైగా రైతన్నలు నామినేషన్లు వేశారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారీ చర్యకు దిగారు. దీంతో ఈ నియోజకవర్గ పోటీలో మొత్తం 1,033 మంది బరిలో నిలిచారు. అప్పట్లో బ్యాలెట్‌ పేపరు కాకుండా పుస్తకాన్నే ముద్రించాల్సి వచ్చింది. దిన పత్రికల సైజులో బ్యాలెట్‌ పుస్తకాన్ని ముద్రించారు. నాలుగు అడుగుల పొడవున్న బ్యాలెట్‌ బాక్సులను వాడారు. పోలింగ్‌ సమయాన్నీ పొడిగించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి సుబ్బులక్ష్మి జగదీశన్‌ విజయం సాధించారు. ముగ్గురు తప్ప అంతా డిపాజిట్లు కోల్పోయారు. 88 మందికి ఒక్క ఓటూ రాలేదు. 158 మందికి ఒక్కో ఓటు పోలయింది.
  • 1996లోనే కర్ణాటకలోని బెళగావి నుంచి 456 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో మహారాష్ట్ర ఏకీకరణ సమితి నుంచి 452 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో 301 మంది, 1996లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో 456 మంది అభ్యర్థులు పోటీ చేసి రికార్డు సృష్టించారు. 1996లోనైతే ఏకంగా 2 నెలలపాటు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.

1996తోనే డిపాజిట్‌ పెంపు

1996 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 13,000 మందికిపైగా బరిలో నిలిచారు. అప్పట్లో సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.500 ఉండటంతో చాలా మంది సరదాగానూ పోటీ చేసేవారు. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం డిపాజిట్‌ను రూ.10,000కు పెంచింది. దీంతో 1998 నాటికి పోటీ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

పోటీకి ఆసక్తి చూపని పంజాబ్‌ అన్నదాతలు

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా రైతులు మాత్రం ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదు. 2 నెలలుగా పంజాబ్‌, హరియాణా సరిహద్దుల్లో ఉన్నవారు నిరసనకు ఎన్నికల్లో పోటీ మార్గం కాదని భావిస్తున్నారు. తాము భాజపా విధానాలను వ్యతిరేకిస్తున్నామని, అయినంత మాత్రాన పోటీ చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.


తెలంగాణలోనూ..

తెలంగాణలోనూ నిజామాబాద్‌ పసుపు రైతులు తమ నిరసనను తెలియజేయడానికి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 176 మంది రైతన్నలు నామినేషన్లు వేయడంతో ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పెద్ద బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ గెలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని