ఇంటి వద్ద పింఛను ఇవ్వకపోవడం వైకాపా కుట్రే

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ ఇవ్వకపోవడం వైకాపా కుట్రేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 02 Apr 2024 06:41 IST

ఖజానా ఖాళీ చేసి తెదేపాపై దుష్ప్రచారం విమర్శలను తిప్పికొట్టండి
నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ ఇవ్వకపోవడం వైకాపా కుట్రేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. అవ్వా తాత అంటూనే సీఎం జగన్‌ వారిని మోసగించారని దుయ్యబట్టారు. పింఛన్ల పంపిణీపై వైకాపా అబద్ధాలు జగన్‌ నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక రూ.13 వేల కోట్ల నిధుల్ని అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. నేడు పింఛన్లు ఇవ్వడానికి నగదు లేక ఆ నెపాన్ని తెదేపా, ఎన్నికల సంఘంపై నెడుతున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెదేపా ఎవరినీ అలా కోరలేదు

‘క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టండి. తెదేపా ప్రభుత్వం వచ్చాక రూ.4 వేలు పింఛను ఇస్తుందని.. రెండు, మూడు నెలలు తీసుకోకపోయినా ఒకేసారి చెల్లిస్తామనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయండి. వాలంటీర్లతో పింఛన్‌ పంపిణీ చేయనివ్వకూడదని ఈసీతో సహా ఎవరినీ తెదేపా కోరలేదు. వారిని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌ వాడుకోబట్టే ఈసీ వారిని సంక్షేమ పథకాల అమలు నుంచి దూరం పెట్టింది. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే ఇంటింటికీ పింఛన్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వమే కావాలని ఇవ్వడం లేదు. తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, దివ్యాంగుల్ని వేధించాలని జగన్‌ చూస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఇంటి వద్దే పింఛన్‌ ఇవ్వాలి. జిల్లా స్థాయి నేతలు కలెక్టర్లను, మండల స్థాయి నేతలు తహసీల్దార్లను కలిసి పింఛన్ల పంపిణీపై వినతిపత్రాలు ఇవ్వండి’ అని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రానికి నేనే డ్రైవర్‌గా ఉంటా

‘ప్రజాగళం సభలకు వస్తున్న స్పందన.. కూటమి గెలుపునకు సూచిక. జగన్‌ను ఇంటికి పంపాలనే బలమైన భావన, కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్‌ రూ.పది ఇచ్చి రూ.వంద దోచేస్తున్న అంశాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలి. వైకాపా వాళ్లు తప్పుడు పోస్టులు పెడుతూ ముఖ్యంగా ముస్లింలలో అభద్రతా భావం పెంచుతున్నారు. గతంలో మనం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా ఏనాడూ వారికి ఇబ్బంది కలగనీయలేదు. పొత్తుపై దుష్ప్రచారం చేస్తున్న వైకాపా వాళ్లు.. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ బేషరతుగా మద్దతిచ్చారు. శింగనమలలో బినామీగా ఉన్న డ్రైవర్‌కు సీటు ఇచ్చారని నేను అంటే ఆ వృత్తిని అవమానపరిచినట్టు ప్రచారం చేశారు. రాష్ట్రానికి నేనే డ్రైవర్‌గా ఉండి గమ్యానికి చేరుస్తా. 3వ తేది(బుధవారం) నుంచి మళ్లీ ప్రజాగళం సభలు ప్రారంభిస్తా’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని