హామీల అమల్లో కాంగ్రెస్‌ విఫలం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి.. భారాసను గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకే ప్రజలు ఓడించారని, వెంటనే నెరవేర్చాలని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 02 Apr 2024 06:03 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి
కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి.. భారాసను గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకే ప్రజలు ఓడించారని, వెంటనే నెరవేర్చాలని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబరు 9న ప్రమాణస్వీకారం చేస్తానని తొలుత చెప్పిన రేవంత్‌రెడ్డి.. పదవి ఉంటుందో లేదోనన్న భయంతో రెండు రోజుల ముందే చేపట్టారని, ఇచ్చిన హామీలను సకాలంలో నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. భాజపాతో భారాస చేయి కలపకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని చెప్పారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమారంలో భారాస జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసీఆర్‌ ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ.. ఇలా అనేక పదవులిచ్చారు. ఆయన జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా తక్కువే. కుమార్తె కోసం కాంగ్రెస్‌లో చేరడం దారుణం. ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కష్టకాలంలో పార్టీని వీడిపోయినవారిని మళ్లీ తీసుకోబోం. ఉద్యమకారులతోనే బలోపేతం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గులాబీ జెండా ఎగురుతుంది. పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కేసీఆర్‌ను ప్రజలు బాగా ఆదరించారు. రేవంత్‌ ఒక్కనాడైనా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించారా? కాంగ్రెస్‌ గ్యారంటీలు వచ్చినవారు ఆ పార్టీకి ఓటేయండి. రానివారు భారాసకు ఓటేయండి.

ఎన్నికలకు ముందు భారాస ప్రభుత్వం రైతుబంధు జమకు సొమ్ము సిద్ధం చేస్తే ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసి అడ్డుకుంది. అధికారంలోకి వచ్చాక ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు వాడుకుంది. ప్రభుత్వ చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తొలగిస్తానని సీఎం పదేపదే అంటున్నారు. దాన్ని తీసేస్తే వరంగల్‌ అగ్నిగుండంలా మారుతుంది. కాంగ్రెస్‌ను ప్రజలు భూస్థాపితం చేస్తారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలు ఇవ్వలేదు. ఎన్నికల వేళ గిరిజన వర్సిటీ పనులు మొదలుపెట్టింది. మాట మాట్లాడితే ఆ పార్టీ వాళ్లు రామమందిరం అంటున్నారు. రాముడిని మనమంతా పూజిస్తాం. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్‌ అద్భుతంగా కట్టారు. అయోధ్య అక్షింతలను మోదీ పంచినట్టు యాదాద్రి లడ్డూలను ఇంటింటికీ పంచి మేము రాజకీయం చేయలేదు. భాజపా వాళ్లకన్నా నేను గొప్ప రామభక్తుడిని’’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా హనుమాన్‌ చాలీసాలోని కొన్ని పంక్తులను ఆయన చదివారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను తెరపై ప్రదర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో తెదేపాలో కడియంకు తానే టికెట్‌ ఇప్పించానని, చంద్రబాబుతో మాట్లాడి మంత్రి పదవి ఇప్పించానని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తానన్నారు. సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని