ధరణి కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేదు?

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 115 రోజులు గడుస్తున్నా ధరణి కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేదని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 03 Apr 2024 05:16 IST

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం
భాజపా నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 115 రోజులు గడుస్తున్నా ధరణి కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేదని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విదేశీ కంపెనీతో ధరణి పోర్టల్‌ తీసుకువచ్చి గత భారాస సర్కార్‌ అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన దాదాపు 20 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల్లో 18 లక్షల ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మిగిలాయని... చెరువులు, ఎసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూముల్లో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైతే, విచారణ జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. నెల రోజుల్లో ప్రభుత్వ భూములపై విచారణ జరిపి అక్రమార్కులను జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

ట్యాపింగ్‌పై కేసీఆర్‌ని ఎందుకు విచారించరు?: రఘునందన్‌రావు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఎవరూ కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేరని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎందుకు విచారణలో భాగస్వామ్యం చేయలేదో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ చెప్పాలని అన్నారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. డబ్బులు జప్తు చేశామని విచారణలో మాజీ పోలీసు అధికారులు చెబుతుంటే డబ్బు పోయినవాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్లమెంటు  ఎన్నికల్లో భాజపాను నిలువరించడానికి కాంగ్రెస్‌, భారాస కలిసి ఆడుతున్న నాటకమా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు సహా 2014 జూన్‌ 2 నుంచి జరిగిన వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు.

హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమ పోస్టర్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని