కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేటి నుంచి నిరసనలు

కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు వ్యతిరేకమని రుజువు చేసుకుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Updated : 03 Apr 2024 05:12 IST

మంద కృష్ణ మాదిగ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు వ్యతిరేకమని రుజువు చేసుకుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోకవర్గాల్లో రెండింటిని (పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌) మాలలకు కేటాయించారని, మిగిలిన వరంగల్‌ స్థానం కోసం ఐదారుగురు మాదిగలు ఎదురుచూస్తుండగా మాదిగ ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు ఇచ్చారని అన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 3 నుంచి పది రోజుల పాటు అన్ని జిల్లా, అసెంబ్లీ, మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఎస్సీ జనాభాలో 70%ఉన్న మాదిగలకు మొండిచెయ్యి చూపి, ఆ సామాజిక వర్గం ఉనికిని కాంగ్రెస్‌ ప్రశ్నార్థకం చేసింది. ఎస్సీల్లో 25% ఉండే మాలలకు రెండు సీట్లు, ఊరికో ఓటు కూడా లేని బైండ్లకు ఒక సీటు ఇచ్చారు. మొత్తం 17 స్థానాల్లో 12 జనరల్‌ కాగా అందులో 6 ఒకే సామాజికవర్గానికి కేటాయించారు. ఖమ్మం, కరీంనగర్‌ సైతం ఆ వర్గానికే కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందుచెప్పిన ప్రతి మాటనూ రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్నారు’’ అని మంద కృష్ణ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని