‘రాహుల్‌..’ అదేం భాష?

అధికారానికి దూరమైపోవడంతో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్‌ ‘రాజకుటుంబ యువరాజు’ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు.

Updated : 03 Apr 2024 05:09 IST

మేం మళ్లీ వస్తే దేశం అట్టుడికిపోతుందా?
కాంగ్రెస్‌ను అన్నిచోట్లా తుడిచిపెట్టండి
ఇప్పటివరకు మేం చేసింది ఒక ట్రైలరే
ఇక చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయి: మోదీ

రుద్రపుర్‌ (ఉత్తరాఖండ్‌), జైపుర్‌: అధికారానికి దూరమైపోవడంతో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్‌ ‘రాజకుటుంబ యువరాజు’ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో మంగళవారం తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీలో జరిగిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. ఇటీవల దిల్లీలో జరిగిన విపక్ష కూటమి సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే దేశం అట్టుడికిపోతుందని కాంగ్రెస్‌ యువరాజు వ్యాఖ్యలు చేశారు. అలాంటి మంటల్ని గత పదేళ్లుగా నేను ఆర్పుతూనే ఉన్నా. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా? అలాంటి భాష ఆమోదయోగ్యమా? అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా? మీరు వారిని శిక్షించరా?’’ అని ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని అన్నిచోట్లా తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం లేదు

‘‘అవినీతిలో కూరుకుపోయినవారు నన్ను దూషించేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో ఎంతో జరిగింది. అదొక ట్రైలర్‌ మాత్రమే.. జరగాల్సింది ఇంకెంతో ఉంది. మూడో విడత పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలుంటాయి. అవినీతిని రూపుమాపాలని మేం అంటున్నాం. లంచగొండుల్ని కాపాడాలని వారు చెబుతున్నారు. మేం అధికారంలోకి మళ్లీ రాగానే అవినీతిపై మరింత గట్టి ముష్టిఘాతం తప్పదు. అవినీతిపరుల్లో ఒక్కొక్కరిపై చర్యలు కొనసాగుతాయి. కాంగ్రెస్‌, ‘ఇండి’ కూటమి తమ ఉద్దేశాలేమిటనేది స్పష్టంచేశాయి. అధికారం లేకపోవడాన్ని అవి భరించలేకపోతున్నాయి. అందుకే దేశంలో మంటలు రేగుతాయని మాట్లాడుతున్నాయి. అత్యయిక పరిస్థితి భావజాలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాస్వామ్యంపై ఎంతమాత్రం నమ్మకం లేదు. అందుకే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్లో తలమునకలైంది. దేశాన్ని అస్థిరపరిచి, అరాచకం దిశగా పంపాలని చూస్తోంది. చొరబాటుదారుల్ని ప్రోత్సహించిన ఆ పార్టీ.. మేం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకువస్తే ఇబ్బంది పడుతోంది. బుజ్జగింపుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఆ పార్టీకి దేశ ప్రయోజనాలు ఎంతమాత్రం పట్టవు’’ అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ సర్కార్ల బలహీనత వల్లనే దేశ విభజన జరిగిందన్నారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. దేశభక్తి గురించి మాట్లాడడం తగదని చెప్పారు.

రెండు భిన్న శిబిరాల మధ్య పోరు

‘ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు రెండు భిన్న శిబిరాల మధ్య జరుగుతున్నాయి. నిజాయతీ-పారదర్శకత ఉన్నవారికి, అవినీతి-కుటుంబపాలన చేసేవారికి మధ్య పోరాటమిది. మా సర్కారు చేపట్టిన పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నిచేశాక ఇక చేయడానికి ఏముందని, నేను విశ్రాంతి తీసుకోవాలని కొందరు చెబుతున్నారు. నేను పుట్టింది కష్టపడి పనిచేయడానికే తప్ప వినోదం చూడడానికి కాదన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఉద్దేశం మంచిదైదే అభివృద్ధి సాధ్యమవుతుంది. నన్ను మరింత బలపరచండి. అవినీతిని పూర్తిగా పెకిలించి, స్వయంసమృద్ధ భారత్‌ కలను నెరవేరుస్తాను’ అని ప్రధాని హామీ ఇచ్చారు. దేశ భవిష్యత్తును కాపాడడంలో ఈ ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు. దేశం కంటే కుటుంబమే పెద్దదని కాంగ్రెస్‌ భావిస్తుందని, భాజపా మాత్రం కుటుంబం కంటే దేశానికే ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని