కేటీఆర్‌.. మీ కుటుంబం సంగతి చూసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

‘భారాస అధికారం కోల్పోయిన మూడు నెలల్లోపే కీలక నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. మీ సోదరి కవిత మద్యం కేసులో కూరుకుపోయి తిహాడ్‌ జైల్లో ఉన్నారు.. ముందు మీ కుటుంబం, పార్టీ సంగతి చూసుకోండి’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విరుచుకుపడ్డారు.

Updated : 03 Apr 2024 07:28 IST

ఈనాడు, హైదరాబాద్‌ - ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ‘భారాస అధికారం కోల్పోయిన మూడు నెలల్లోపే కీలక నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. మీ సోదరి కవిత మద్యం కేసులో కూరుకుపోయి తిహాడ్‌ జైల్లో ఉన్నారు.. ముందు మీ కుటుంబం, పార్టీ సంగతి చూసుకోండి’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. పంటపొలాలకు నీళ్లివ్వడం లేదని, కరెంటు కోతలు విధిస్తున్నారంటూ కేటీఆర్‌ ప్రచారం చేస్తున్నారని.. దీన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌, ఇతర నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న తుక్కుగూడలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు.

పదేళ్ల పాటు అధికారం లేకున్నా తమ పార్టీ గట్టిగా నిలబడిందని, భారాస మాత్రం ఒక్కసారిగా పాతాళానికి జారిపోయిందన్నారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను లక్ష నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. ఈ నెల 8న ఏడు సెగ్మెంట్ల నాయకులతో సమావేశం నిర్వహించనున్నామని వివరించారు. సికింద్రాబాద్‌ ఎంపీగా, కేంద్ర పర్యాటక మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డి మూసీ పరిరక్షణను విస్మరించారని విమర్శించారు. దానం నాగేందర్‌ ఎంపీగా గెలిస్తే మూసీ పరిరక్షణకు నిధులు తీసుకువస్తారని వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, విజయారెడ్డి, ఆదం సంతోష్‌కుమార్‌, ఫిరోజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని