కాంగ్రెస్‌లో మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే

ఆరు గ్యారంటీలు అమలు చేయడం చేతకాదని, ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాస్తే ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Published : 03 Apr 2024 05:59 IST

ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే..
హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే నిధులు తెస్తాం
రైతుదీక్షలో బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఆరు గ్యారంటీలు అమలు చేయడం చేతకాదని, ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాస్తే ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయన రైతుదీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన భాజపాకు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భారాసకు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ మోసం చేసింది. అమలు చేయకపోయినా రూ.600 కోట్లతో అమలు చేసినట్లు మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ఆ పార్టీలో మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే.

పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి

ప్రజలు, రైతుల పక్షాన కొట్లాడటం, దీక్షలు, ధర్నాలు చేయడం.. మాకు కొత్త కాదు. గత భారాస ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలకు చేసిన ద్రోహంపై అనేక రూపాల్లో కొట్లాడింది భాజపానే. సకాలంలో సాగునీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తడం కాదు.. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లివ్వాలి. పట్టణాల్లో తాగునీటి కొరత ప్రారంభమైనా పట్టించుకోరా? పంటలు ఎండిపోయిన, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారమివ్వాలి. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందే కనీస మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? పంటల బీమాను అమలు చేసి ఉంటే రైతులకు న్యాయం జరిగేది.

ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి కేసీఆర్‌ మాటతప్పారు. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన కరీంనగర్‌కు రావాలి. పదేళ్లలో వేలమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డా చలించలేదు. 2013లో వడ్ల కనీస మద్దతు ధర రూ.1,300 ఉంటే.. ప్రస్తుతం రూ.2,200కు పెంచిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం ఎకరాకు రూ.ఆరు వేల సాయం అందిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ఎరువులపై ఇస్తున్న రాయితీని ఎత్తివేసే ప్రమాదముంది. మేము శ్రీరాముడి ఫొటోతో బరాబర్‌ ఓట్లు అడుగుతాం’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు