అన్న జగన్‌తో షర్మిల యుద్ధం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్‌ కాపాడుతున్నారని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ..ఇప్పుడు అన్నను రాజకీయంగా ఢీ కొట్టనున్నారు.

Published : 03 Apr 2024 05:54 IST

కడప లోక్‌సభ బరిలో సీఎం సోదరి
5 ఎంపీ, 114 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్‌ కాపాడుతున్నారని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ..ఇప్పుడు అన్నను రాజకీయంగా ఢీ కొట్టనున్నారు. తాము విభేదించిన అవినాష్‌రెడ్డికే వైకాపా అధినేత జగన్‌ మళ్లీ కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి టికెట్‌ ఇవ్వడంతో ఆదే గడ్డపై ఆమె అమీతుమీ తేల్చుకోనున్నారు. కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా షర్మిల బరిలో దిగుతున్నారు. అయిదు లోక్‌సభ, 114 శాసనసభ స్థానాలకు కాంగ్రెస్‌ మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తన అన్న జగన్‌పై విమర్శలతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎంపీ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్‌ వెనకేసుకొస్తున్నారని షర్మిల పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీతతో కలిసి గత నెల 15న కడపలో నిర్వహించిన వర్ధంతి సభలోనూ పాల్గొని జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకోవడం, పార్టీ జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు, ఆమెకు టికెట్‌ ప్రకటించడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ నెల 5 నుంచి ఆమె కడప నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

అన్న అవమానించినా చెల్లి చేయూత

జగన్‌ టికెట్లు ఇవ్వకుండా అవమానించిన కొందరికి షర్మిల టికెట్లు కేటాయించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ  వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్‌ ఇవ్వకుండా వైకాపా పరాభవించింది. దీంతో ఆవేదనకు గురైన ఆయన వైకాపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్‌ చింతలపూడి టికెట్‌ ఇచ్చింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌ కూడా వైకాపా చేతిలో భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు నందికొట్కూరు టికెట్‌ను కేటాయించారు. వైకాపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ చేరిన మాజీ ఎమ్మెల్యే పి.మురళీకృష్ణకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పోటీకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.

విధేయులకు పెద్దపీట

కాంగ్రెస్‌ పార్టీని అంటిపెట్టుకుని విధేయత ప్రదర్శించిన నాయకులకు టికెట్ల కేటాయింపులో ఆ పార్టీ అధిష్ఠానం తగిన ప్రాధాన్యమిచ్చింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజులను వరుసగా కాకినాడ, బాపట్ల, రాజమండ్రి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించారు. అలాగే పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌, మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలీ, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు తాంతియా కుమారి శింగనమల, గుంటూరు తూర్పు, తిరువూరు శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని