వారసత్వ బరి!

కన్నడనాట లోక్‌సభ ఎన్నికల్లో వారసులు భారీగా టికెట్లు దక్కించుకున్నారు. మొత్తం 28 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో 14 స్థానాలకు ఈ నెల 26న, మిగిలిన వాటికి మే 7న పోలింగ్‌ జరగనుంది.

Published : 04 Apr 2024 04:09 IST

కర్ణాటకలో రాజకీయ కుటుంబాల నుంచి ఈసారి 16 మందికి టికెట్లు

ఈనాడు, బెంగళూరు: కన్నడనాట లోక్‌సభ ఎన్నికల్లో వారసులు భారీగా టికెట్లు దక్కించుకున్నారు. మొత్తం 28 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో 14 స్థానాలకు ఈ నెల 26న, మిగిలిన వాటికి మే 7న పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే అన్ని స్థానాలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. భాజపా, జేడీఎస్‌ కలిసి కూటమిగా, కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. భాజపా 25 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, జేడీఎస్‌ మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ మొత్తం 28 చోట్లా పోటీపడుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో రాజకీయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు బరిలో దిగి పోటీని ఆసక్తిగా మార్చారు. రాష్ట్రంలో గతంలో ఏ లోక్‌సభ ఎన్నికల్లోనూ లేనంతగా 16 మంది వారసులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

దేవెగౌడ హవా

రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ కుటుంబంగా పరిగణించే మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ ఇంటి నుంచి ముగ్గురు సభ్యులు బరిలో దిగారు. లోక్‌సభ, విధానసభ, స్థానిక ఎన్నికలేవైనా ఈ కుటుంబం నుంచి కనీసం ఇద్దరు పోటీలో ఉండాల్సిందే. ఇదే క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఆయన రెండో కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి మండ్య నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ హాసన నుంచి పోటీపడుతున్నారు. ప్రజ్వల్‌ ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. దేవెగౌడ పెద్దల్లుడు, ప్రముఖ హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ భాజపా  తరఫున బెంగళూరు గ్రామీణ నుంచి పోటీ చేస్తున్నారు.

మరో ప్రముఖ రాజకీయ నేత బి.ఎస్‌.యడియూరప్ప కుటుంబ నుంచి ఆయన పెద్ద కుమారుడు బి.వై.రాఘవేంద్ర శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీ. మరో కీలక నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పెద్దల్లుడు డాక్టర్‌ రాధాకృష్ణ దొడ్డమని కలబురగిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఖర్గే పోటీ చేసి రాజకీయ ప్రయాణంలో తొలి ఓటమిని చవిచూశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ బెంగళూరు గ్రామీణ నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌కున్న ఏకైక సిట్టింగ్‌ ఎంపీ. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు.


మరికొందరు..

ప్రముఖ నేతలే కాకుండా మరికొందరు నాయకుల కుటుంబాల సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పెద్ద వయసున్న ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప (95) కోడలు ప్రభా మల్లికార్జున కాంగ్రెస్‌ అభ్యర్థిగా దావణగెరె నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడే సిట్టింగ్‌ ఎంపీ జి.ఎం.సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వర భాజపా తరపున బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రహమాన్‌ ఖాన్‌ కుమారుడు మన్సూర్‌ అలీఖాన్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారి కుటుంబ సభ్యులు ఆరుగురు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి కనీసం రెండు పదుల స్థానాల్లో గెలవాలని మంత్రులనే బరిలో దింపాలని ప్రయత్నించింది. వారు పోటీకి నిరాకరించి తమ వారసులకు టికెట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఇలా రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (బెంగళూరు దక్షిణ), అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే కుమారుడు సాగర్‌ ఖండ్రే (బీదర్‌), ప్రజాపనుల మంత్రి సతీశ్‌ జార్ఖిహొళి కుమార్తె ప్రియాంకా జార్ఖిహొళి (చిక్కోడి), మహిళా, శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కుమారుడు మృణాల్‌ హెబ్బాళ్కర్‌ (బెళగావి), సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప కుమారుడు సుభాష్‌ బోస్‌ (చామరాజనగర), సహకారశాఖ మంత్రి శివానంద పాటిల్‌ కుమార్తె సంయుక్తా పాటిల్‌ (బాగల్‌కోటె) పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని